హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా టీకే దిలీప్ ఎంపిక దాదాపుగా ఖరారైంది. హైదరాబాద్‌కే చెందిన మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ వారసునిగా జాతీయ జట్టుకు దిలీప్ సేవలందించబోతున్నాడు. అభయ్శర్మతో కలిసి ఫీల్డింగ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్న దిలీప్ వైపు క్రికెట్ సలహాదారుల కమిటీ(సీఏసీ) మొగ్గుచూపినట్లు తెలిసింది. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి వుంది. గత జూలైలో చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి భారత ద్వితీయ శ్రేణి జట్టుకు దిలీప్ ఫీల్డింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. దీనికి తోడు భారత్ ‘ఎ’ జట్టుతో కలిసి న్యూజిలాండ్ పర్యటనలో పాలుపంచుకున్నాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీఏసీ అభయ్కు బదులు దిలీప్ అనుభవానికి పెద్దపీట వేసినట్లు సమాచారం. అయితే ద్రవిడ్ మాత్రం అభయ్ కావాలని కోరినట్లు వినికిడి. ఇదిలా ఉంటే లంక పర్యటనలో తన పనితీరు పట్ల ద్రవిడ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు దిలీప్ పేర్కొన్నాడు. యుక్త వయసు నుంచే కోచింగ్ పట్ల ఇష్టాన్ని పెంచుకున్న 38 ఏండ్ల దిలీప్..ఐపీఎల్లో దక్కన్ చార్జర్స్ జట్టుకు ట్రెవర్ పెన్నీతో కలిసి పనిచేయడం అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో భారత సహాయక బృందంలో చేరే వరకు హైదరాబాద్ జట్టుకు దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.