స్టాక్ మార్కెట్లలో భారీ కరెక్షన్ల నేపథ్యంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపి లేదా సిప్)ను కొనసాగించడమా?.. లేదా?.. అనే సందిగ్ధత మదుపరులలో ఎక్కువైంది. అయితే 3 నెలలపాటు సిప్ మొత్తాలను ఎలాంటి సమాచారం లేకుండా నిలిపేస్తే మ్యూచువల్ ఫండ్ దాని కొనసాగింపును నిరాకరిస్తుంది. కానీ ముందస్తు సమాచారంతో అంగీకరిస్తాయి. గడువు తీరిన తర్వాత యథావిధిగా కొనసాగించవచ్చు. అలాగే నిలిపేసిన మొత్తాలనూ చెల్లించే అవకాశం ఉంటుంది. 3 నుంచి 6 నెలలపాటు నిలిపేయడానికి వీలున్నది. అయితే నెలసరి చెల్లింపులను ఆపాలంటే కనీసం 15 రోజుల ముందు వినతి పత్రాన్ని సమర్పించాలి. కొన్ని ఫండ్లు 20, 30 రోజుల ముందుగానే తెలియజేయాలంటున్నాయి.
కానీ తప్పనిసరైతేనే సిప్‌ను నిలిపేయడానికి మొగ్గు చూపండి. కాగా, ఫండ్ హౌజ్‌లు దాదాపు రెండుసార్లకు మించి ఈ అవకాశాన్ని ఇవ్వవు. ఒక్కసారి రిక్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని రద్దు చేయలేం. కొన్ని మ్యూచువల్ ఫండ్లు కనీసం 6 నెలలపాటు చెల్లిస్తేనే నిలిపేయడానికి అంగీకరిస్తాయి. మరికొన్ని రూ.1000పైన ఉన్న ఎస్ఐపీలకు మాత్రమే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. సిప్ నిలిపివేతకు ఆన్లైన్లో లేదా ఫండ్ హౌజ్ యాప్, ఈ-మెయిల్ ద్వారా, నేరుగా కలెక్షన్ సెంటర్‌కు వెళ్లి కూడా విజ్ఞప్తి చేసుకోవచ్చు. ఇక ఆటో డెబిట్‌ను ఆపాలంటే బ్యాంక్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిందే.