హనుమకొండ చౌరస్తా, జూన్ 30 : కాకతీయ యూనివర్సిటీకీ చెందిన భూములను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి కేయూ భూములు కేటాయించవద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల బాధ్యులు ఎఐఎఫ్డిఎస్ రాష్ర్ట కార్యదర్శి గడ్డం నాగార్జున, డీఎస్ఎ రాష్ర్ట కన్వినర్ కామగోని శ్రావణ్, పిడిఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, బీఆర్ఎస్వీ యూనివర్సిటీ ఇంచార్జి జెట్టి రాజేందర్, పీఎస్ఎఫ్ రాష్ర్ట అధ్యక్షుడు జయసూర్య, బీఎస్ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షుడు శివ, ఎఐడిఎస్‌ఓ జిల్లా ఉపాధ్యక్షుడు మధు, ఎస్‌ఎస్‌యు జిల్లా అధ్యక్షుడు సాయిలు మాట్లాడారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి యూనివర్సిటీ భూములను కేటాయించడానికి పాలకమండలి ఆమోదం తెలిపిన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని, అన్యాక్రాంతానికి గురైన యూనివర్సిటీ భూములను తిరిగి స్వాధీనపర్చుకొని, హద్ధులు నిర్ణయించి యూనివర్సిటీ చుట్టూ ప్రహరీ నిర్మించాలన్నారు. కబ్జాలకు గురైన యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకుని యూనివర్సిటీకి అప్పచెప్పాల్సిన యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలలో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపట్టడం దుర్మార్గమన్నారు. అనంతరం పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎఐఎఫ్డిఎస్ రాష్ర్ట గర్ల్స్కన్వీనర్ మాస్ సావిత్రి, డీఎస్ఎ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు అజయ్, బీఆర్ఎస్వీ నాయకులు పస్తం అనిల్, కొత్తూరు రోహిత్, పాలబోయిన రాజు, జువాజీ, శ్రీజిత్ పాల్గొన్నారు.