Sri Lanka VS Australia | గాలె : శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం గాలె వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఆసీస్.. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆట నాలుగో రోజు లంక నిర్దేశించిన 75 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. 2011 తర్వాత శ్రీలంకలో కంగారూలకు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం. లంక గడ్డపై చివరిసారిగా ఆ జట్టు 2011లో రికీ పాంటింగ్ సారథ్యంలో సిరీస్ గెలిచింది.
రెండు టెస్టులలోనూ బ్యాటింగ్ వైఫల్యాలతో విఫలమైన లంక సిరీస్‌ను నిలబెట్టుకోకపోగా ఘోర ఓటములను చవిచూడాల్సి వచ్చింది. కాగా ఈ టెస్టు ముగియడంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్లో ఫైనల్ మాత్రమే మిగిలుంది. ఈ ఏడాది జూన్‌లో లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య తుదిపోరు జరుగనుంది. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 69.44 శాతంతో అగ్రస్థానంలో ఉండగా ఆసీస్ 67.54 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. 50 శాతం పాయింట్లతో భారత్ మూడో స్థానంతో ముగించింది.