Madhya Pradesh : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఆరుగురు మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, అనుప్పూర్ జిల్లా, గింజ్రి గ్రామ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పడానియా గ్రామానికి చెందిన 50 మందికి పైగా స్థానికులు ఒక మతపరమైన కార్యక్రమం కోసం బిజోరా గ్రామానికి ట్రాక్టర్లో బయల్దేరారు.
వీరంతా వెనుక ట్రాక్టర్లో ఉన్నారు. ఈ క్రమంలో గింజ్రి గ్రామం వద్దకు రాగానే ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్లోని వారంతా ట్రాలీ కింద చిక్కుకుపోయారు. ఒకరిమీద ఒకరు పడిపోయి, తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్తానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులకు చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు తగిన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.