చిత్రసీమలో పుష్కర ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది అగ్ర కథానాయిక శృతిహాసన్. ఈ ప్రస్థానంలో ఓ నటిగా ఎంతో నేర్చుకున్నానని, ఎలాంటి పరిణామాలు ఎదురైనా స్వతంత్ర వ్యక్తిత్వంతో జీవించాలని అవగతమైనదని చెప్పింది. పెళ్లి విషయంలో తనకు నిశ్చితాభిప్రాయాలున్నాయని, సమయం వచ్చినప్పుడు అదే జరిగిపోతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సుందరి ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం ‘సలార్’లో నటిస్తున్నది. బాలీవుడ్లో కూడా పలు సినిమాల్ని అంగీకరించింది. 12ఏళ్ల తన సినీ ప్రయాణం గురించి శృతిహాసన్ చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే..
‘సలార్’ చిత్రం భాషా హద్దుల్ని చెరిపివేస్తూ సార్వజనీన అంశాలున్న కథాంశంతో తెరకెక్కుతున్నది. ‘బాహుబలి’ ‘కేజీఎఫ్’ చిత్రాలతో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్‌నీల్ దక్షిణాది సత్తా ఏమిటో దేశం మొత్తానికి తెలియజెప్పారు. వీరిద్దరి కలయికలో వస్తున్న ‘సలార్’ అనేక సంచలనాలకు వేదికగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది.
పన్నెండేళ్ల క్రితం హిందీ చిత్రసీమలో అడుగుపెట్టినప్పుడు విచిత్రమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. ముఖ్యంగా దక్షిణాది వారి పట్ల ఉత్తరాది వారు భిన్నమైన అభిప్రాయాల్ని కలిగి ఉంటారని తెలుసుకున్నా. ‘దక్షిణాది నుంచి వచ్చిన మీరు ఇంత ఫెయిర్‌గా ఎలా ఉన్నారు? మీ ఇంగ్లీష్‌లో తమిళ యాస కనిపిస్తుంది? అంటూ ఎన్నో ప్రశ్నలు వేసేవారు. సాంస్కృతికపరమైన అపార్థాల వల్ల వాళ్ల ఆలోచనాధోరణి అలా ఉందని సర్దిచెప్పుకున్నా.
వృత్తిపరంగా మాత్రం హిందీ చిత్రసీమలో ఎలాంటి వివక్ష ఎదురుకాలేదు. పని విషయంలో మన నిబద్ధ్దత, అంకితభావాన్ని వారెంతగానో గౌరవిస్తారు. అలాగే కథాంశాల విషయంలో దక్షిణాది వారి సృజనాత్మకత, పాత్ర పోషణలో వైవిధ్యాన్ని ఇష్టపడతారు. ప్రస్తుతం ఏ పరిశ్రమలోనూ భాషా,ప్రాంతీయ విభేదాలు కనిపించడం లేదు. కేవలం ప్రతిభ మాత్రమే ప్రామాణికంగా అవకాశాలిస్తున్నారు.
గత కొంతకాలంగా నేను మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నా. మానసికమైన ఒత్తిళ్లు, కుంగుబాటు నుంచి ఉపశమనం పొందటానికి మార్షల్ ఆర్ట్స్ ఔషదంలా పనిచేస్తున్నాయి. సినిమాల్లో కూడా ఆ పోరాట విద్యల్ని ప్రదర్శించాలనుంది. అయితే కథతో సంబంధం లేకుండా కథానాయికలు పోరాటఘట్టాల్లో పాల్గొనడాన్ని ప్రేక్షకులు ఇష్టపడరు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఏదైనా కథ నా దగ్గరకు వస్తే అందులో నా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తా.
కామెడీ పాత్రలకు న్యాయం చేయడంలోనే కథానాయికల అసలైన ప్రతిభ దాగి ఉంటుంది. నా దృష్టిలో అన్నింటికంటే కామెడీని పండించడం చాలా కష్టం. నేను ఇప్పటివరకు కమర్షియల్ చిత్రాల్లోనే ఎక్కువగా నటించా. భవిష్యత్తులో యాక్షన్ చిత్రాల్లో నటించాలనుంది.
పెళ్లి గురించి కేవలం కథానాయికలనే ఎందుకు ప్రశ్నిస్తారో ఇప్పటికీ అర్థంకాదు. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. దాని గురించి ఇతరులకు నేనెందుకు సమాధానం చెప్పాలి? నేను ప్రేమించిన వాడి దగ్గర మాత్రమే పెళ్లి గురించి మాట్లాడతా. పరిపూర్ణ మహిళగా అందరి అంచనాలకు తగినట్లుగా జీవించడం నాకు సాధ్యం కాదు. ఎవరి నిర్వచనాలకు నేను అందను. నాదైన ప్రపంచంలో నేను పరిపూర్ణ మహిళనే అనుకుంటున్నా.
ముప్పైఏళ్ల వయసు దాటగానే మహిళలు జీవితంలో స్ధిరపడిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నా దృష్టిలో అది అర్థంలేని విషయం. నన్ను నేను గొప్పగా అర్థం చేసుకోవడం ముప్పైఏళ్ల తర్వాతే మొదలైంది. జీవితం మీద సంపూర్ణమైన అవగాహన, స్పష్టత ఏర్పడింది. వయసు గురించి పెద్దగా ఆలోచించకుండా జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలన్నదే నా సిద్ధాంతం.