Sheikh Hasina | బంగ్లా అల్లర్ల వెనుక అమెరికా హస్తం.. తనకు వ్యతిరేకంగా కుట్ర: మాజీ ప్రధాని షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన తిరుగుబాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉన్నదని మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
- మాజీ ప్రధాని హసీనా సంచలన ఆరోపణలు
- సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని అప్పగించుంటే తన ప్రభుత్వం కొనసాగేదని వ్యాఖ్య
- ప్రధానిగా రాజీనామా తర్వాత జాతినుద్దేశించి చేయాలనుకొన్న ప్రసంగంలో హసీనా వెల్లడి
- అలాంటి ప్రసంగం లేదన్న కుమారుడు సాజీద్
Sheikh Hasina | ఢాకా/న్యూఢిల్లీ, ఆగస్టు 11: బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన తిరుగుబాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉన్నదని మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తనకు వ్యతిరేకంగా అమెరికా కుట్ర చేసిందని, సెయింట్ మార్టిన్స్ ద్వీపం కోసమే ఇదంతా చేసిందని వెల్లడించారు. తాను గనుక వ్యూహాత్మకమైన సెయింట్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించి ఉంటే.. తన ప్రభుత్వం కొనసాగేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు, అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేయకముందు, భారత్‌కు రాకముందు షేక్ హసీనా జాతినుద్దేశించి మాట్లాడాలనుకొన్నారు. కానీ అమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో సైనిక ఉన్నతాధికారులు అందుకు అనుమతించలేదు. ఆమె జాతినుద్దేశించి చేయాల్సిన ప్రసంగం తాజాగా బయటకు వచ్చిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే వార్తా నివేదికలను హసీనా కుమారుడు సాజీద్ వాజెబ్ ఖండించారు. అవి పూర్తిగా కల్పితమని, తప్పు అని ఆదివారం రాత్రి ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఢాకాను వీడేముందు, తర్వాత ఏ విధమైన ప్రకటన ఇవ్వలేదని తన తల్లి చెప్పారన్నారు.
శవాల ఊరేగింపును చూడాలనుకోలేదు..
తాను మాట్లాడాలనుకొన్న అంశాల గురించి హసీనా తన సన్నిహితులతో చెప్పారని, ఆమె మాట్లాడలేకపోయిన తన ప్రసంగం బయటకొచ్చిందని పలు మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ మార్పునకు అమెరికా కుట్ర చేసిందని ఆరోపించారు. ‘శవాల ఊరేగింపును తాను చూడాలనుకోలేదు. విద్యార్థుల మృతదేహాలపై నడుచుకుంటూ అధికారంలోకి రావాలని వాళ్లు అనుకొన్నారు. అయితే నేను దాన్ని అనుమతించలేదు. ప్రధాని పదవికి రాజీనామా చేశాను. సెయింట్ మార్టిన్ ద్వీపం సార్వభౌమాధికారాన్ని గనుక నేను అమెరికాకు అప్పగించి ఉంటే, బంగాళాఖాతంపై ఆ దేశానికి పట్టు కల్పించి ఉంటే తాను అధికారంలో కొనసాగేదాన్ని. దయచేసి అతివాదుల మాయలో పడొద్దని దేశ ప్రజలను కోరుతున్నాను’ అని హసీనా పేర్కొన్నారు. తాను దేశంలోనే ఉంటే మరిన్ని ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుందని, అందుకే తాను పదవి నుంచి దిగిపోతున్నానని అన్నారు.
త్వరలో దేశానికి తిరిగొస్తాను
జాతినుద్దేశించి చేయలేకపోయిన ప్రసంగంలో హసీనా తన పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా సందేశం ఇచ్చారు. అవామీ లీగ్ పార్టీ తిరిగి నిలబడుతుందని, ఆశ కోల్పోవద్దని, తాను త్వరలో దేశానికి తిరిగి వస్తానని పేర్కొన్నారు. అవామీ లీగ్ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకోవడం తనకు చాలా బాధగా ఉందన్నారు. ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను తాను రజాకార్లు అని పిలువలేదని ఈ సందర్భంగా ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సెయింట్ మార్టిన్స్ ద్వీపం ప్రాధాన్యమేంటి?
సెయింట్ మార్టిన్స్ ద్వీపం విస్తీర్ణం కేవలం 3 చదరపు కిలోమీటర్లు. 3,700 మంది నివాసం ఉంటారు. వీరంతా చేపల వేట, వరి, కొబ్బరి సాగు, సముద్రపు పాచి సేకరణపై ఆధారపడి జీవిస్తుంటారు. ఈ ద్వీపం బంగాళాఖాతం సముద్రానికి ఈశాన్యంలో, బంగ్లాదేశ్‌కు దక్షిణాన తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉండే సెయింట్ మార్టిన్స్ బంగ్లాదేశ్‌కు ఉన్న ఏకైక ద్వీపం. ఇది 1947 వరకు బ్రిటీష్ ఇండియాలో భాగంగా, ఆ తర్వాత పాకిస్థాన్ నియంత్రణలోకి, అనంతరం 1971లో బంగ్లాదేశ్‌లో ఒక భాగమైంది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య 1974లో ఒప్పందం కుదిరినప్పటికీ, ద్వీపం సముద్రపు సరిహద్దు విభజనపై వివాదం ఉండేది.
సెయింట్ మార్టిన్ ద్వీపంపై అంతర్జాతీయంగా ప్రధానంగా అమెరికా, చైనా దృష్టి సారించాయి. రీజియన్‌లో తమ ఉనికి బలోపేతం చేసుకొనేందుకు ఈ ద్వీపాన్ని ఉపయోగించుకోవాలనుకొన్నాయి. ఈ ద్వీపంలో ఎవరు మిలటరీ బేస్‌ను నిర్మించుకొన్నా చైనా ప్రధానంగా రవాణాకు ఉపయోగించే మలక్కా జలసంధిపై వ్యూహాత్మక ఉనికి కలిగి ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ గెలుపునకు సహకరిస్తే బదులుగా సెయింట్ మార్టిన్స్‌లో మిలటరీ బేస్‌ను కట్టుకొనేందుకు ద్వీపాన్ని అమెరికాకు అమ్మేసేలా మాజీ ప్రధాని ఖాలిదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) ప్లాన్ వేసిందనే ఆరోపణల తర్వాత ఈ ద్వీపంపై అందరి దృష్టి పడింది. ఈ ఆరోపణలను అమెరికా ఖండించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

