e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 25, 2022
Home News స్పర్శ.. కథల పోటీ-2020’లో ప్రచురణకు ఎంపికైన కథ

స్పర్శ.. కథల పోటీ-2020’లో ప్రచురణకు ఎంపికైన కథ


నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2020’లో ప్రచురణకు ఎంపికైన కథ.
ఈవారం కథ

సౌజన్య వణికిపోతూ గట్టిగా ప్రతిఘటించింది. పెనుగులాటలోనే ఆమె లంగాబొందు ముడి లాగేశాడు సుందరయ్య. సిగ్గుతో చచ్చిపోతూ, కోపంతో విసురుగా లేచి, సుందరయ్యను ఒక్కతోపు తోసేసింది. పిచ్చిదానిలా బయటకు పరుగుతీసింది. ఇంటికి ఎలా వచ్చిందో తెలియదు. లోపలికి వస్తూనే.. బావురుమంటూ తల్లిని పట్టేసుకుంది. “చూశావా ఎంత ఘోరం జరిగిందో!” అంటూ ఏడుస్తున్న తల్లిని అయోమయంగా చూసింది.

- Advertisement -

అర్ధరాత్రి ఫోన్‌ మోగగానే మంచినిద్రలో ఉన్న సౌజన్య, ఉలిక్కిపడి లేచింది.“డాక్టర్‌.. ఎమర్జెన్సీ కేస్‌” అని అవతలి వ్యక్తి చెప్పగానే, ఆమె మత్తు ఠక్కున వదిలిపోయింది. ఓవైపు డ్యూటీ డాక్టర్లకు ఫోన్లో సూచనలు ఇస్తూనే, మరోవైపు బట్టలు మార్చుకొన్నది. ఆ అలికిడికి నిద్ర లేచిన శశాంక్‌.. “ఏంటి డియర్‌?” అన్నాడు. “ఆసుపత్రికే లెండి!” అంటూ భర్త నుదుటిమీద చిన్నముద్దుపెట్టి, బయటకు వచ్చేసింది. ఆసుపత్రికి చేరగానే ఐసీయూలోకి వెళ్లబోతున్న సౌజన్యకు కేస్‌షీట్‌ అందించింది నర్స్‌. “సుందరయ్య, 83 ఏండ్లు, తీవ్రమైన గుండెపోటు..” వివరాలు చదువుతూనే రోగి వంక చూసిన డాక్టర్‌ సౌజన్య, ఒక్కసారిగా కొయ్యబారిపోయింది. కోపం, కసి ఉవ్వెత్తున ఎగసి, సౌజన్య మస్తిష్కాన్ని ఉక్కిరిబిక్కిరి చేయగా.. ఆమె మనస్సులో పెను తుఫానే లేచింది.

కానీ, చేదుగతం మీద వృత్తిధర్మం విజయం సాధించి, ఆ రోగిని పరీక్షించేలా చేసింది. డాక్టర్‌ స్పర్శకు ఆయన చిన్నగా కదిలి, కళ్లు తెరిచి ఆమెను చూడగానే..
“నువ్వు… నువ్వు” అంటూ వణికిపోతూ, ఫిట్స్‌ వచ్చినవాడిలా గిలగిలా కొట్టుకున్నాడు.ఇంజక్షన్‌ ఇవ్వగానే మగతగా తల వాల్చేశాడు. ఐసీయూ నుంచి బయటకు రాగానే, సౌజన్య కళ్లు అతనికోసం త్రీవంగా గాలించాయి. స్తంభానికి ఒక పక్కగా దిగులుగా నిలబడి ఉన్నాడతను. ‘సాగర్‌.. నా సర్వస్వం. నా తొలిప్రేమ. అదే రూపం. చెంపలే కొద్దిగా నెరిశాయి’ అనుకొంటూ, అతణ్ని చూస్తూ శిలలా నిలబడిపోయింది. ఐసీయూ డోర్‌ వద్దే నిలబడ్డ రోగి బంధువు ఒకామె ఫోన్‌లో మాట్లాడుతున్న మాటలు.. సౌజన్యకు వినబడుతున్నాయి.

“మావయ్యగారికి గయలో పిండ ప్రదానం పూర్తి చేసుకొని, కాశీకి కారులో వస్తున్నాం. అంతలోనే తాతయ్యకు గుండెపోటు ఇంతలా ముంచుకు వస్తుందని అనుకోలేదు. పేరు కూడా తెలియని ఊరిలో చిక్కుకుపోయాం” అంటున్నది. సౌజన్యను చూస్తూనే ఫోన్‌ పెట్టేసి.. “డాక్టర్‌గారు, ఎలా ఉందండి?” అంటూ ఆందోళనగా అడిగింది. ఆ మాటలు వింటూనే డాక్టర్‌ వంక చూసిన అతను.. చటుక్కున వెనక్కి తిరిగి, దిగ్భ్రాంతిగా నిలబడిపోయాడు. “ప్రమాదంగానే ఉంది” లోగొంతుతో అంటూ ముందుకు నడిచింది సౌజన్య.అతను.. ఆమె వంక అలా చూస్తూనే ఉన్నాడు. తను చెప్పేదేమీ అతను వినడంలేదని ఆమెకు అర్థమవుతోంది. ఆమె నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే.. అతని అడుగులు ఆమె వెంటే సాగాయి.
“ఎన్నేళ్లయ్యింది సౌజీ..” కంపిస్తున్న స్వరంతో అన్నాడు. అతని కళ్లు మాటిమాటికీ చెమ్మగిల్లు తూనే ఉన్నాయి.
“పదహారేళ్లు సాగర్‌” చిరునవ్వును అరువు తెచ్చుకుంటూ అన్నది.

దూరంగా అతని భార్య బెంచీ మీద కూర్చుని కునికిపాట్లు పడటం ఆమెకు కనిపిస్తూనే ఉన్నది.
“ఎక్కడి కేరళ, ఎక్కడి బీహార్‌. నిన్ను ఇలా కలవాలని దేవుడెంత చిత్రంగా నిర్ణయించాడు”.. తనలోతాను అనుకున్నట్లుగా, బయటకు అనేశాడు.
‘నిర్ణయం..’ ఆమె మనసు ఆ పదం దగ్గర చిక్కుపడిపోయింది. కళ్లముందు గతం మెదిలింది.

ఊరి చివరగా విసిరేసినట్టున్న కాలనీలో సౌజన్య, సాగర్‌ కుటుంబాలు ఉండేవి. అంతస్తుల భేదం ఉన్నా స్నేహంగా మసలుకునేవాళ్లు. కలిసే బడికి వెళ్లేవాళ్లు. సాగర్‌ తల్లిదండ్రులకు ఆడపిల్లలు లేకపోవడంతో, సౌజన్యను ముద్దుచేస్తూ అభిమానంగా చూసుకునేవాళ్లు. సౌజన్య చిన్నతనం నుంచి వాళ్లింట్లోనే ఎక్కువగా గడిపేది. ఆమెకు అర్థంకాని పాఠాలను సాగర్‌ వివరించి చెబుతుండేవాడు.
తాతయ్య సుందరయ్య అంటే సాగర్‌కు ప్రాణం. తనకు ఇష్టంలేకుండా లాంతర వివాహం చేసుకున్న కొడుకుపై సుందరయ్యకు కోపం. అందుకే, కొడుకింటి గడప తొక్కలేదు. కానీ, తన పోలికలతో ఉన్న మనవడంటే ఆయనకు వెర్రి ప్రేమ.
కొన్నిరోజులకు బామ్మగారికి పక్షవాతం రావడంతో చికిత్స కోసమని పట్నం తీసుకొచ్చారు. తాతయ్య తమ ఇంటికి వచ్చారనీ, తండ్రీ కొడుకులు ఇన్నేళ్ల తరువాత కలిశారని సౌజన్యతో చెబుతూ మహదానందపడ్డాడు సాగర్‌. ఆమెను తాతయ్యకు పరిచయం చేశాడు. ఆ క్షణమే.. ఏ అడ్డంకీ లేకుండా సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలోకి రాహువు ప్రవేశించాడు.

బాల్యంలో సాగర్‌ – సౌజన్య మధ్య చిగురించిన స్నేహం.. యుక్తవయసు వచ్చేసరికి ప్రేమగా మారింది. అయితే, తనతో సుందరయ్య ప్రవర్తించే తీరు.. సౌజన్యకు విపరీతంగా అనిపించేది. సాగర్‌ ఇంటికి వెళ్లినప్పుడు చుట్టూ ఎవరూ లేకుండా చూసి..
“రా మనవరాలా” అంటూ.. ఆమెను పక్కగా కుర్చోబెట్టుకొనేవాడు. ఆమె ఒళ్లంతా తడిమేసేవాడు. ఈ చేష్టలు ఆమెకు అర్థమయ్యేవి కావు. రానురాను ఆ స్పర్శ వెనుక దురుద్దేశం గ్రహించాక, పదహారేళ్ల సౌజన్య.. భయంతో తల్లడిల్లి పోయింది. హేయమైన అతని ప్రవర్తన గురించి తల్లిదండ్రులకు చెప్పేద్దామనుకుంది.
కానీ, ఏం జరుగుతుందోనన్న భయంతో, తనలోతానే కుమిలిపోతూ వచ్చింది. ముఖ్యంగా సాగర్‌కు ఎలా చెప్పాలో తెలియక, సతమతమైపోయింది. సౌజన్య పిరికితనం సుందరయ్యకు అలుసుగా అయిపోయింది. దీంతో క్రమక్రమంగా సాగర్‌ వాళ్ల ఇంటికెళ్లడమే తగ్గించేసింది సౌజన్య. ఇటు బామ్మను ఆసుపత్రుల చుట్టూ తిప్పడానికి, ఆమె కోలుకోవడానికీ చాలా సమయమే పట్టింది.చూస్తుండగానే.. రెండు మూడేండ్లు గడిచిపోయాయి.

“సౌజీ.. నువ్వు ఇంటికి రావడం లేదని అమ్మ గుర్తు చేస్తోంది. తాతయ్య కూడా రోజు అడుగుతున్నాడు. ఏమైంది?” అడిగాడు సాగర్‌.
‘తాతయ్య’ అన్న మాట వినగానే.. ఆమె గుండెలు దడదడలాడాయి.
“సాగర్‌.. మన ప్రేమ విషయం ఆయనకు తెలుసా?” సాలోచనగా అడిగింది సౌజన్య.
“లేదు.. చెప్పాలి! ఈ నెలాఖరులో పీజీ సీటు రాకపోతే ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతా. నాన్న విషయంలో జరిగింది మళ్లీ రిపీట్‌ కానివ్వొద్దు”.
“ఎందుకని.. మాది కూడా మీ అమ్మగారి కులమేననా?” సూటిగా అడిగింది.
“ఛ? మధ్యలో ఈ కులాలేమిటి? ఆ పరిస్థితే ఎదురైతే నీ కోసం ఎవ్వరినైనా ఎదిరిస్తాను”..
అతనిలోని ధైర్యానికి, తనపై ఉన్న ప్రేమకు కళ్లలో చివ్వుమని కన్నీళ్లు చిమ్మాయి.
“నువ్వేదో విషయం చెప్పకుండా దాస్తున్నావు. తాతయ్య ఒప్పుకోడేమోనన్న అనుమానమేదో నీ మనసులోకి వచ్చింది. ఇక్కడ కాలేజీ దగ్గరెందుకు, పద ఇంటికెళ్లి మాట్లాడుకుందాం”.
ఇంటికి రాలేనని చెప్పలేక.. బేలగా చూస్తూ ఉండిపోయింది. చాలాసేపు బతిమాలడంతో.. “రేపు వస్తానులే” అని అతికష్టంగా అన్నది.
“సరే నీ ఇష్టం! రాలేదంటే ఇక మన మధ్య ఎప్పటికీ మాటలుండవు. నా మీద ఒట్టే!” అంటూ తన తలపై చేయివేసి అన్నాడు.

‘ఇక దాచకుండా సాగర్‌కి అంతా చెప్పేయడమే మంచిది’ మనస్సులోనే గట్టిగా నిశ్చయించుకొంటూ.. ఆరోజు అతనింటికి వెళ్లింది.
వీధి తలుపులు తీసే ఉన్నాయి. కానీ, ముందుగదిలో ఎవరూ ఉన్నట్టుగా అనిపించడం లేదు. లోపలి గదుల్లోకి తొంగిచూసి. హాల్‌లోకి తిరిగి వస్తుంటే వీధితలుపు గడియ వేస్తూ కనిపించాడు సుందరయ్య.
“ఇంట్లో ఎవరూ లేరు. పండుగకి కొత్తబట్టలు కొనుక్కోవడానికని ఇప్పుడే వెళ్లారు”.. గుంట
నక్కలా ఆమెనే చూస్తూ అన్నాడు.
అనుమానంగా చూసి గడియ తీయబోయింది.
“రావడం మానేశావే!” అంటూ దగ్గరకువచ్చి, ఆమె జబ్బ పట్టుకున్నాడు.
బెదిరిపోయి.. “నేను వెళ్లిపోతాను” అన్నది.
“అప్పుడేనా.. ఒక్కణ్నే ఉన్నా. కాసేపు కూర్చో. కబుర్లు చెప్పుకుందాం”.. ఆమెను గట్టిగా దగ్గరకు లాక్కుంటూ అన్నాడు.
“లేదు.. నేను వెళ్లాలి. ఏంటిది, వదలండి?”.. అంటూ, ఆయన చేతుల నుంచి విదిలించుకొంది.
“ఏమిటంత పొగరు?” అంటూ గట్టిగా కసిరి.. ఆమెను మోటుగా సోఫాలోకి తోసేసి, ఉద్రేకంగా ఆక్రమించుకున్నాడు.
సౌజన్య వణికిపోతూ గట్టిగా ప్రతిఘటించింది. పెనుగులాటలోనే ఆమె లంగాబొందు ముడి లాగేశాడు సుందరయ్య. సిగ్గుతో చచ్చిపోతూ, కోపంతో విసురుగా లేచి, సుందరయ్యను ఒక్కతోపు తోసేసింది. పిచ్చిదానిలా బయటకు పరుగుతీసింది. ఇంటికి ఎలా వచ్చిందో తెలియదు. లోపలికి వస్తూనే.. బావురుమంటూ తల్లిని పట్టేసుకుంది.

“చూశావా ఎంత ఘోరం జరిగిందో!” అంటూ ఏడుస్తున్న తల్లిని అయోమయంగా చూసింది.
“సౌజీ.. అమ్మమ్మ పోయిందని కబురు వచ్చినప్పటి నుంచీ అమ్మను అస్సలు పట్టుకోలేకపోతున్నా. బట్టలు సర్దేసేయ్‌. రైలుకు అందుకోకపోతే ఆఖరిచూపూ దక్కదు” అన్నాడు తండ్రి.
తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఏడుస్తుంటే.. అందరూ అమ్మమ్మ కోసం ఏడుస్తోందని అనుకున్నారు. ఆమె దుఃఖమంతా.. ఆ చావులోనే కలిసిపోయింది. దినాలు కాగానే, మావయ్యల ఆస్తి పంపకాల వ్యవహారాలతో కొద్దిరోజులపాటు ఊళ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.
విషయాన్ని సాగర్‌ చెప్పినా.. తన తాతయ్య ఇంత నీచుడని తెలుసుకొని తనలో తానే కుంగిపోతాడనుకుంది. అలా అని అన్నీ మరిచిపోయి, అతనింట్లోకి ఇల్లాలిగా అడుగుపెట్టడమన్నది ఊహించుకోడానికే అసహ్యంగా అనిపించసాగింది. చివరికి అతనితో బంధాన్ని తెంచుకోవడమే సరైన నిర్ణయంగా భావించి, డాక్టర్‌ అవ్వాలన్న తన లక్ష్యం మీద దృష్టి మరల్చింది. అమ్మమ్మ మరణంతోనే తన ప్రేమనూ సమాధి చేసింది.

“సౌజీ.. ఎందుకు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావ్‌? చాలా చిక్కిపోయావ్‌. ఏమైందసలు?” ఆవేదనగా అడిగాడు సాగర్‌.
“మెడికల్‌ ఎంట్రన్స్‌ కోసం రాత్రింబవళ్లూ చదువుతున్నా” తల తిప్పుకొంటూ చెప్పింది.
“నేనేం తప్పు చేశాను? నన్ను దూరం పెట్టడంవల్ల నువ్వేమన్నా ఆనందంగా ఉన్నావా? నీ సంతోషమే నాకు ముఖ్యం. నీ మనసులో ఏముం దో చెప్పు!” అంటూ నీళ్లు నిండిన కళ్లతో అన్నాడు.
“నేను సంతోషంగా ఉండాలని నువ్వు నిజంగా కోరుకుంటే.. ఇక నన్నెప్పుడూ కలవకు. నాకు బాగా చదువుకోవాలనీ, డాక్టర్ని అవ్వాలని ఉంది. మన దారులు వేరు”.. అంటూ ఏడ్చేసింది.
అతనెంత ప్రాధేయపడినా అందనంత దూరంగా జరిగిపోయింది.

“సౌజీ.. ఎక్కడో కేరళలో పనిచేస్తున్న నేను, ఇక్కడ బీహార్‌లోని ఈ చిన్న టౌన్‌లో నిన్నిలా కలుసుకోవడాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా..”
గతా న్ని పక్కకి తోస్తూ సాగర్‌ అన్నాడు.
తన కలల జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన నాటి సంఘటనలన్నీ సౌజన్య కళ్లముందు సజీవంగా తిరుగుతుండగా అలాగే కూర్చుండిపోయింది.
“తాతయ్య పరిస్థితి ఏమిటి?” మళ్లీ అడిగాడు.
“కొంచెం ప్రమాదంగానే ఉంది. ఈ రాత్రి గడిస్తే గండం గట్టెక్కినట్టే!”.
“ఇంత అర్ధరాత్రి వేళ నిన్ను ఇబ్బంది పెట్టి పిలిపించారు” అన్నాడు.
దానికామె చిన్నగా నవ్వి..
“ఈ హాస్పిటల్‌ మాదే. ఇందాక వచ్చిన హార్ట్‌ స్పెషలిస్ట్‌, నేను కలిసి స్థాపించాం. ఇల్లు కూడా బాగా దగ్గరే. మా వారు ఇక్కడ ప్లాంట్‌లో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌” అని చెప్పింది.

“పిల్లలు!”.. ఆసక్తిగా అడిగాడు.
“ఒక పాప. మరి నీకు?”.
కనిపిస్తున్న భార్య వంక చూస్తూ..
“లేరు. తాతయ్యకు తెలిసిన దూరపు బంధుత్వ సంబంధం మాది. జన్యు సమస్యలవల్ల ఇద్దరు పిల్లలుపుట్టి వెంటనే పోయారు”.
ఇంతలో నర్స్‌ వచ్చి.. “సుందరయ్య కండిషన్‌ ఈజ్‌ వెరీ సీరియస్‌ మేడమ్‌” అని చెప్పింది.
దీంతో ఇద్దరూ ఐసీయూలోకి పరుగెత్తారు. అప్పటికే ఆయన ఎగ ఊపిరి.. దిగ ఊపిరితో ఉన్నాడు. సౌజన్యకేసి చూస్తూ, పెదాలు కదుపుతూ ఏదో చెప్పబోతూ.. రెండుచేతులూ జోడించడానికి ప్రయత్నిస్తూ తలవాల్చేశాడు.
“తాతయ్యా!” అంటూ ఆయన కాళ్లమీద కుప్పలా కూలిపోయాడు సాగర్‌.

దుఃఖాన్ని దిగమింగుకుంటూ అతని భార్యే అన్నీ చూసుకొన్నది. శవ పరీక్షలు పూర్తి చేసి, శవాన్ని అప్పగించేటప్పటికి తెల్లవారుతూ ఉంది.
కారు బయలుదేరుతున్న సమయంలో..
“సౌజీ.. ఇప్పుటికైనా చెబుతావా? నువ్వే నా జీవితమనుకున్న నన్ను ఎందుకంత నిర్దాక్షిణ్యంగా నెట్టేశావ్‌! నిజం తెలుసుకునే అర్హతను నాకిప్పటికైనా ప్రసాదిస్తావా?”.. అర్థిస్తున్నట్టుగా అడిగాడు.
కలవరంగా చూసింది. దూరంగా అంబులెన్సులో శవాన్ని ఎక్కించడం కనిపిస్తోంది.
చనిపోయిన వ్యక్తి మీద అతనికి దురభిప్రాయాన్ని కల్పించడమన్నది ఆమెకు మరోసారి ఇష్టంలేక పోయింది. నిజం చెప్పకపోవడమే సరైన నిర్ణయంగా అనిపించింది.
“చెప్పడానికి అప్పుడేమీ లేదు. ఇప్పుడేమీ లేదు. ఏ బంధం ఎవరిని కలుపుతుందో, ఎందుకు విడదీస్తుందో అర్థం కాదు” అంటూ అక్కడి నుంచి భారంగా కదిలింది సౌజన్య.
ఆమె వెళ్తున్న వైపే బాధగా చూస్తూ, చాలాసేపు నిలబడిపోయాడు. ‘కేరళ వెళ్లిన వెంటనే కలువు’ అంటూ సౌజన్య ఇచ్చిన సంతాన సాఫల్య డాక్టరైన ఆమె స్నేహితురాలి చిరునామా కాగితం అతని చేతిలో రెపరెపలాడుతోంది.
కారుమలుపు తిరుగుతుండగా, యథాలాపంగా వెనుకకు తలతిప్పి చూసిన సాగర్‌కు..
‘సాగర్‌ హాస్పిటల్‌’ అన్న నేమ్‌బోర్డు సూర్యకిరణాల మధ్య మెరుపులా మెరిసి, అతణ్ని క్షణం
పా టు అచేతనుణ్ని చేసింది. ‘తన ఆసుపత్రికి నా పేరు పెట్టిందా!’ అనుకొంటూ ఆ ఆసుపత్రి పేరులో తన ప్రతిబింబాన్ని చూసుకొన్నాడు.

“ఏంటీ మీరిక్కడ?”.. కారు పార్కింగ్‌ దగ్గర కనిపించిన భర్తను చూస్తూ అడిగింది సౌజన్య.
“వాకింగ్‌ కోసం పార్కుకు వెళ్లకుండా ఇటు
వైపుగా వచ్చా..” తడబడుతూ అన్నాడు శశాంక్‌.
“కాదులెండి. ఇవాళ కోర్టు తీర్పు ఉన్నదని వచ్చారు”.. అతనెంత బలమైన నైతిక మద్దతునిస్తూ, అన్ని విషయాల్లోనూ ఎలా తన వెన్నంటి ఉంటాడో ఆమెకు బాగా తెలుసు.
“నువ్వు కోర్టుకి వెళ్లాలి కదా! రాత్రంతా నిద్ర ఉండి ఉండదు. అందుకని..” అన్నాడు దొరికిపోయినట్టుగా చూస్తూ.
తన ఇంటి పనిమనిషి తొమ్మిదేళ్ల కూతురిని అమానుషంగా పాడుచేసి, చంపేసిన ఇద్దరు
మృగా ళ్ల శిక్షపై, కోర్టుతీర్పు వచ్చేరోజది. మూడేళ్ల క్రితం జరిగిన ఆ ఘోరానికి కదిలిపోయిన సౌజన్య, న్యాయం కోసం తిరుగుతూ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా మద్దతుగా నిలబడింది.
“ఆ దోషులకు ఖాయంగా ఉరిశిక్ష పడుతుంది” అన్నది తన భర్తతో.. కారు డోర్‌ తీస్తూ!
“నీకు విశ్రాంతి కావాలి. నేను డ్రైవ్‌ చేస్తా”.. అంటూ ఆమెను వెనక సీట్లో కూర్చోపెట్టాడు. సీట్లో జారగిలపడి రాత్రినుంచి అనుభవిస్తున్న సంఘర్షణను, కంటి రెప్పలకింది కన్నీళ్లను పైకి కనిపించనీయకుండా గట్టిగా కళ్లు మూసుకుంది.

తొలిప్రేమ బలమైంది. సాగర్‌ను ఎంతగానో ప్రేమించింది. ఒక పశువు వల్ల తన కలల జీవితం కూలిపోయింది. ఎన్నో ఏళ్లపాటు ఆ దుర్మార్గుడు మీదకువచ్చి తనను చెరుస్తున్నట్టుగా వచ్చే పీడకలలతో వణికిపోయేది. తన బాధను ఎవరితోనూ పంచుకోలేక తనలో తానే కుమిలిపోయేది. నెమ్మది నెమ్మదిగా ధైర్యాన్ని తెచ్చుకుంటూ, ఎదుగుతున్న కొద్దీ తనను తాను బలమైన వ్యక్తిగా మలుచుకొంది. మంచి వైద్యురాలిగా, సామాజిక కార్యకర్తగా సమాజంలో పేరు తెచ్చుకుంది.

‘ఈ బట్టలు నీవి. ఈ గాజులు నీవి, ఈ పుస్తకం నీది..’ అంటూ చిన్నచిన్న వస్తువుల పైనే జాగ్రత్తలు చెబుతూ ఆడపిల్లను బడికో, బయటికో పంపుతారు తల్లితండ్రులు. ఏదైనా పోతే ఫిర్యాదుచేసి, దొంగిలించిన వాళ్లకు గట్టి శిక్ష వేయించాలని చిన్నతనం నుంచే నేర్పిస్తారు. అదే కూతురిని వేధిస్తే, పరువు పోతుందన్న భయంతో ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు? ‘క్షమయా ధరిత్రి’ అంటూ క్షమించి సహించాలంటున్నారు.
‘ఇన్నాళ్లుగా అపురూపంగా, ప్రేమగా సంరక్షిస్తున్న అమ్మాయి లేత శరీరాన్ని ఇష్టం వచ్చినట్టుగా తడిమేయడానికి, పాడు చేయడానికి ఆ పశువులకు హక్కెవరిచ్చారు? తప్పుచేసిన మృగం ధైర్యం గా తలెత్తుకొని తిరగగలుగుతోంది. సాహసించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలికి దక్కే వి పెదవి విరుపులు, చులకన చూపులా? ఎక్కడి ఆటవిక సమాజంలో బతుకుతున్నాం మనం?’
దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల గురించి విన్నప్పుడల్లా ఈ ప్రశ్నలన్నీ సౌజన్యను చాలాకాలం వేధించాయి. అందుకే మనసు చెదిరిపోయిన బాధితులకు అండగా నిలిచింది సౌజన్య. న్యాయ పోరాటాలకు తోడ్పడుతూ, ధైర్య వచనాలు చెబుతూ వాళ్లకు జీవితం మీద మళ్లీ ఆశలను చిగురించేలా చేస్తున్నది.

అసలు అత్యాచారం సంగతి దేవుడెరుగు, ఆడపిల్ల శరీరంలోని ఏ భాగాన్నయినా స్పర్శించడానికి మృగాడు భయపడి తీరాలని, ఒంటి మీద చేయి వేయడానికి వీలులేని కఠినమైన చట్టాలు రూపొందించాలనీ, కావాలని తాకిన త్రాష్టులపై ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి, సత్వరమే న్యాయచర్యలు చేపట్టడానికి, బలమైన వ్యవస్థను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనలతో మరో కొత్త పోరాటానికి ఆమె సమాయత్తం అవుతున్నది.
ఎన్నో ఏళ్లపాటు ఆ దుర్మార్గుడు మీదకువచ్చి తనను చెరుస్తున్నట్టుగా వచ్చే పీడకలలతో వణికిపోయేది. తన బాధను ఎవరితోనూ పంచుకోలేక తనలో తానే కుమిలిపోయేది. నెమ్మది నెమ్మదిగా ధైర్యాన్ని తెచ్చుకుంటూ, ఎదుగుతున్న కొద్దీ తనను తాను బలమైన వ్యక్తిగా మలుచుకొంది.

కె. వాసవదత్త రమణ
కామరాజుగడ్డ వాసవదత్త రమణ స్వస్థలం హైదరాబాద్‌. తెలంగాణ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌లో డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. టీవీ పరిచయకర్తగా, రచయిత్రిగా సుపరిచితురాలు. ఈమె రాసిన 150కి పైగా కథలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వాటితోపాటు రెండు ధారావాహికలు, తమిళ అనువాద కథ, ఒక ఆంగ్ల అనువాద కథల సంపుటితోసహా ఏడు పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఒంటరి నక్షత్రం, వెలుగురేఖలు, స్వాగతం, అంతరాలు (కథా సంకలనాలు), సంధ్యారాగం, లక్ష్యం (నవలలు) వెలువరించారు. బాలల కథల పుస్తకం ప్రచురణకు సిద్ధంగా ఉన్నది. కనువిప్పు, కలిసిన మనసులు నాటకాలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి. 35 ఏళ్లుగా టీవీ పరిచయకర్తగా వందలాది సాహిత్య కార్యక్రమాలు, సాహితీ ప్రముఖులపై డాక్యుమెంటరీలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు. 40 ఏళ్లుగా అనేక రేడియో నాటకాల్లో పాల్గొన్నారు. శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘సచ్చిదానంద పీఠం’ నుంచి ఉగాది పురస్కారం, ‘లేఖిని’ సంస్థ నుంచి యద్దనపూడి సులోచనారాణి స్మారక పురస్కారం, వివిధ కథల పోటీల్లో ప్రత్యేక బహుమతులు అందుకొన్నారు.

  • కె.వాసవదత్త రమణ, 97044 44760
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement