చండీగఢ్, అక్టోబర్ 5 : అజ్ఞాత వ్యక్తుల సలహాలను అనుసరించవద్దని, ఫిన్ఫ్లుయెన్సర్లతో జాగ్రత్తగా ఉండాలని, ఆకర్షణీయ రాబడులను అందజేస్తామన్న మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దంటూ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే సోమవారం మదుపర్లను హెచ్చరించారు. పెట్టుబడులపై మదుపర్లలో అవగాహనను పెంచడం కోసం ‘ప్రాజెక్ట్ జాగరూక్’ కార్యక్రమాన్ని సెబీ దేశవ్యాప్తంగా ప్రారంభించింది. పంజాబ్ విశ్వవిద్యాలయంలో ‘ప్రాజెక్ట్ జాగరూక్’ ప్రారంభం సందర్భంగా పాండే మాట్లాడుతూ.. కేవలం ఎవరో చెప్పారని ఎవరూ ఎక్కడా పెట్టుబడులకు దిగవద్దని సూచించారు. అందరూ మదుపు చేస్తున్నారని, పెట్టుబడులపై ఏమాత్రం అవగాహన లేకుండానే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారని హితవు పలికారు. పెట్టుబడులపై పూర్తిగా తెలుసుకున్నాకే ఓ నిర్ణయానికి రావడం ఉత్తమమని సలహా ఇచ్చారు.
గడిచిన దశాబ్దకాలంలో భారతీయ క్యాపిటల్ మార్కెట్లలో మదుపర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని పాండే గుర్తుచేశారు. ఈ క్రమంలోనే మోసపూరిత పెట్టుబడులపట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అందుకే సెబీ నియంత్రణలోని ఉత్పత్తులు, వేదికలు, సంస్థలనే పెట్టుబడుల విషయంలో వినియోగించాలని సూచించారు. ఇక కెరియర్ ఆరంభంలోనే యువత పెట్టుబడులను మొదలుపెడితే లాభదాయకమని, మదుపును కొనసాగిస్తూపోతే చక్రవడ్డీ ప్రయోజనాలు అందుతాయని సలహా ఇచ్చారు.
దేశవ్యాప్తంగా మోసపూరిత పెట్టుబడులపై మదుపర్లను అప్రమత్తం చేయడానికి ఇంగ్లిష్, హిందీతోపాటు మరో 11 ప్రాంతీయ భాషల్లోనూ అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు పాండే తెలిపారు. టెలివిజన్, ప్రింట్, రేడియో, సినిమా, ఔట్డోర్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా, ఓటీటీ, వాట్సాప్ సహా ఇతర భౌతిక మార్గాల్లోనూ అమాయక మదుపర్ల ప్రయోజనాల రక్షణకు కృషి చేస్తున్నట్టు వివరించారు. ‘ప్రాజెక్ట్ జాగరూక్’లో భాగంగా సెబీ, స్టాక్ ఎక్సేంజీలు, డిపాజిటరీలు, భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్లు కలిసి సమన్వయంతో, పరస్పర సహకారంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. అలాగే యూనివర్సిటీల్లోనూ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నట్టు సెబీ చీఫ్ పాండే చెప్పారు.