పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ మూడవ రౌండ్లో సానియా మీర్జా జోడి ఓటమి పాలైంది. సానియా మీర్జా, చెక్ రిపబ్లిక్ పార్ట్నర్ లూసీ హడెక్కా తీవ్రంగా పోరాడినా ఆ జంటకు పరాజయం తప్పలేదు. అమెరికా జోడి కోకో గాఫ్, జెస్సికా పెగులా చేతిలో 6-4, 6-3 స్కోర్‌తో సానియా జోడి ఓటమిని చవిచూసింది. నిజానికి ఈ మ్యాచ్‌లో సానియా, హడెక్కా అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. కానీ యువ అమెరికా జోడి దూకుడు ముందు సానియా జోడి నిలువలేకపోయింది. లోయర్ ఫోర్‌హ్యాండ్ షాట్లతో మీర్జా ఆకట్టుకున్నా.. హడెక్కా బేస్‌లైన్ షాట్లతో పవర్ గేమ్ ఆడినా.. కీలక సమయాల్లో మాత్రం అమెరికా ప్లేయర్లు పాంయిట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. తొలి సెట్లో ఓ దశలో సానియా బ్రేక్ పాయింట్ సాధించినా ఆ తర్వాత మ్యాచ్‌పై పట్టు సాధించలేకపోయారు. రెండవ సెట్ ఆరంభంలో ఇండో చెక్ జోడి దూకుడును ప్రదర్శించింది. పెగులా సర్వీస్‌ను బ్రేక్ చేశారు. 2-0 ఆధిక్యాన్ని సాధించినా.. అనవసర తప్పిదాలతో సానియా జోడి మ్యాచ్‌ను చేజార్చుకున్నది.