హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో స్థలాలు, బహుళ అంతస్తుల భవనాల్లో వాణిజ్య స్థలాలు విక్రయిస్తామని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసగించిన సంధ్య కన్వెన్షన్ ఎండీ సర్నాల శ్రీధర్‌రావును సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. కేవలం రియల్ ఎస్టేట్ దందాలే కాకుండా పలువురు రాజకీయ నాయకులు, అధికారులకు ఇతడు బినామీగా వ్యవహరిస్తున్నట్టు, ఓటుకు నోటు కేసులో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయిందని సమాచారం.
తొలుత అతడి అరెస్టును అడ్డుకొనేందుకు ప్రయత్నించిన కొందరు ‘పెద్దలు’ ఇప్పుడు విడుదల చేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తున్నది. శ్రీధర్‌రావు అరెస్టు విషయం తెలియగానే పదుల సంఖ్యలో అతని బాధితులు నార్సింగి, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీసుస్టేషన్లకు క్యూ కట్టారు. ఓ సాఫ్ట్వేర్ సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్ రాయదుర్గం ప్రధాన రోడ్డుపై ఉన్న సంధ్య టెక్నో భవనంలో వాణిజ్య స్థలం ఇప్పించాలని శ్రీధర్‌రావుకు 2018లో రూ.11 కోట్లు ఇచ్చాడు.
గత మూడేండ్లుగా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేసిన శ్రీధర్‌రావు, డబ్బు తిరిగి ఇచ్చేయాలన్న శ్రీనివాస్‌ను చంపేస్తానని హెచ్చరించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. శ్రీనివాస్ ఫిర్యాదుపై స్పందించిన రాయదుర్గం పోలీసులు శ్రీధర్‌రావును అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో శ్రీధర్‌రావుకు సంబంధించిన పలు విస్మయకరమైన అంశాలు వెలుగు చూసినట్టు తెలుస్తున్నది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు శ్రీధర్‌రావు అత్యంత ప్రీతిపాత్రుడని తెలుస్తున్నది. చంద్రబాబు అండతో శ్రీధర్‌రావు అప్పట్లో పలు సెటిల్మెంట్లు చేసిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ హయాంలో నాటి మంత్రులు, ఎమ్మెల్యేలకు బినామీగా వ్యవహరించిన శ్రీధర్‌రావు వారి నల్లధనాన్ని రియల్ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తున్నది. ఆ సమయంలో అతడు అనధికారికంగా హవా చెలాయించాడని మోసపోయిన బాధితులు వెల్లడిస్తున్నారు. తనకున్న రాజకీయ పలుకుబడితో పోలీసు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులను కూడా బుట్టలో వేసుకున్నాడు. గ్యాంగ్‌స్టర్ నయీంతో సత్సంబంధాలు ఉన్న పోలీసు ఉన్నతాధికారులతో కూడా శ్రీధర్‌రావు పలు వ్యాపారాలు చేసినట్టు సమాచారం.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన ఓటుకు నోటు కుట్ర కేసు లో శ్రీధర్‌రావు కూడా పాత్రధారేనని పోలీసుల విచారణలో తేలినట్టు తెలిసింది. ప్రజాప్రతినిధులను కొనేందుకు అవసరమైన డబ్బు ను శ్రీధర్‌రావు సమకూర్చినట్టు వెలుగులోకి వచ్చింది. ఆ నగదునే ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్సీ వద్దకు తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. మాదాపూర్ ప్రాం తంలో రెండెకరాల స్థలం ఇప్పిస్తానని ఓ బడా వ్యాపారి నుంచి శ్రీధర్‌రావు రూ.60 కోట్లు తీసుకున్నాడు. కానీ ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పుకుంటున్నాడని తెలిసింది. ఇలా చాలామంది నుంచి రూ.100 కోట్ల వరకు వసూలు చేశాడని సమాచారం. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపేందుకు సిద్ధమని పోలీసులు తెలిపారు.