హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు చెందిన బాణం గుర్తును ఇతరులకు ఎలా కట్టబెడుతారంటూ కార్మికలోకం గర్జించింది. టీఎంయూకు చెందిన గుర్తును తిరిగి కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లేబర్ కమిషనర్ ఆఫీసును సోమవారం టీఎంయూ, ఈయూ, ఎన్ఎంయూ యూనియన్లకు చెందిన వేలాదిమంది కార్మికులు ముట్టడించారు. తమకు ఎంతోకాలంగా ఉన్న విల్లు-బాణం ఎన్నికల గుర్తును వేరే వర్గానికి కేటాయించడం పట్ల టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం థామస్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనకి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
హక్కులను సాధించుకునే విషయంలో కార్మికవర్గం అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను కాంగ్రెస్ కాలరాస్తున్నదని థామస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలకు అనుగుణంగా కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం కార్మికశాఖపై ఉన్నదని అన్నారు. హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ప్రభుత్వానికి ఎలా వత్తాసు పలుకుతారని నిలదీశారు. చట్టాలను కాలరాసిన ప్రొసీడింగ్ ఆఫీసర్‌ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. టీఎంయూను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే గుర్తును కాంగ్రెస్ దొంగిలించిందని ఆరోపించారు. ఈయూ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. టీఎంయూ గుర్తును తిరిగి ఆ సంఘానికే కేటాయించాలని డిమాండ్ చేశారు. గుర్తుల కేటాయింపు అంశంపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), ఎన్ఎంయూ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.