Spain | మాడ్రిడ్, నవంబర్ 3: వరదల కారణంగా నష్టపోయిన పపోరాట పట్టణంలో బాధితుల పరామర్శకు వెళ్లిన స్పెయిన్ రాజ కుటుంబానికి తీవ్ర అవమానం జరిగింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాధితులు ఆదివారం రాజు ఫిలిప్ 6, రాణి లెతిజియా ముఖాలపై బురద జల్లారు. దీంతో రాజు, రాణి ముఖాలు, దుస్తులు బురదతో నిండిపోయాయి. పక్కన ఉన్న అంగరక్షకులు గొడుగులు అడ్డుపెట్టి ఆపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు.
తమను ‘హంతకులు’ అని నిందించడమే కాక, పరుష పదజాలంతో తూలనాడుతున్న బాధితులతో రాజ దంపతులు మాట్లాడటానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా బాధితులు ప్రధాని పెడ్రో శాంచెజ్, వేలన్సియా రీజియన్ హెడ్ కార్లోస్ మేజన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేజన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, వారం క్రితం పపొరాటాలో సంభవించిన భారీ వరదల కారణంగా భారీ ఆస్తి నష్టంతో పాటు 200 మందికి పైగా పౌరులు మరణించారు. తమను ప్రభుత్వం ఆదుకోలేదని బాధితులు ఆగ్రహంతో ఉన్నారు.