న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్లు గీతా, బబితా ఫోగాట్ సోదరి రితికా ఫోగాట్ ఆత్మహత్య చేసుకుంది. గురువారం తెల్లవారుఝామున జరిగిన దురదృష్టకర ఘటన రెజ్లింగ్ అభిమానులను కలిచివేసింది. భరత్‌పూర్‌లో బుధవారం జరిగిన ఓ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిందన్న బాధలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. రితికా ఫోగాట్ వయసు 17 ఏళ్లు. రెజ్లింగ్‌లో పేరుగాంచిన ఫోగాట్ కుటుంబం నుంచి వచ్చిన ఆమె రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ టోర్నీల్లో ఆడుతోంది. ఫైనల్లో కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయానన్న బాధలో ఆమె తన ప్రాణం తీసుకున్నది. ద్రోణాచార్య అవార్డు విన్నర్ అయిన ప్రముఖ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగాట్ దగ్గర ఆమె శిక్షణ పొందింది. గత ఐదేళ్లుగా మహావీర్ ఫోగాట్ స్పోర్ట్స్ అకాడమీలో ఆమె శిక్షణ తీసుకుంటోంది. రితికా ఆత్మహత్యపై విచారణ జరుపుతున్నట్లు హర్యానాలోని చర్ఖి దాద్రి జిల్లా ఎస్పీ రామ్‌సింగ్ బిష్ణోయ్ ఒక ప్రకటనలో విడుదల చేశారు. మ్యాచ్‌లో ఓడిపోవడం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని ఆయన తెలిపారు. హర్యానా మంత్రి విజయ్‌కుమార్ సింగ్ తన ట్విటర్ ద్వారా ఈ వార్తను బయటపెట్టారు. మహావీర్ ఫోగాట్, ఆయన ఇద్దరు కూతుళ్లు గీతా, బబితా ఫోగాట్లపై 2016లో బాలీవుడ్లో దంగల్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.