మహిళల్లో రక్తహీనత అధికం అవుతున్నది. 15 నుంచి 49 ఏండ్ల వయసు వారిలో దాదాపు 67 శాతం మందిని వేధిస్తున్నది. ముఖ్యంగా, ఉద్యోగిణుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది. అయితే, చాలామందిలో రక్తహీనత ఆలస్యంగా బయటపడుతున్నది. ఫలితంగా, వారి ఆరోగ్యం మరింతగా దెబ్బతింటున్నది. ఇటీవలి కొన్ని అధ్యయనాలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. రక్తహీనతను వీలైనంత త్వరగా గుర్తించి, పరిష్కరించాలని సూచిస్తున్నాయి.
ఉద్యోగిణులు ఆఫీస్‌తోపాటు ఇంటి పనులతోనూ బిజీగా ఉంటారు. ఆహారంతోపాటు ఆరోగ్యాన్నీ పెద్దగా పట్టించుకోరు. ఫలితంగా, బలహీనత, తలనొప్పి, తల తిరగడం, గుండె దడ లాంటి సమస్యలకు గురవుతున్నారు. మనదేశంలో ఉద్యోగాలు చేస్తున్నవారిలో ఎక్కువశాతం 24 ఏండ్ల నుంచి 55 ఏండ్లలోపు వారే! వీరంతా పీరియడ్స్ సమయంలో 30 నుంచి 40 మిల్లీలీటర్ల రక్తాన్ని కోల్పోతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటే, నెలకు 15 నుంచి 20 మిల్లీగ్రాముల ఐరన్ నష్టపోతున్నట్లే! ఇక అధిక పని ఒత్తిడి, ఇతరత్రా సమస్యలు ఉన్నవారు 80 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ రక్తాన్ని, అధికంగా ఐరన్‌ను కోల్పోతారట.
సగటు ఉద్యోగిణులంతా సంప్రదాయ ఆహారాన్నే తీసుకుంటారు. అయితే, సాధారణ ఆహారం నుంచి శరీరానికి కావాల్సినంత ఐరన్ లభించడం లేదట. యువతులు ఎక్కువగా డైటింగ్ చేయడం, మాంసాహారానికి దూరంగా ఉండటం వల్ల కూడా ఐరన్‌లోపం తలెత్తుతున్నది. దీని నుంచి బయట పడాలంటే.. ఆహారంతోపాటు జీవనశైలిలోనూ తగినంతగా మార్పులు చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. పాలకూర, బీన్స్, టోఫు, కాయధాన్యాలతోపాటు తృణధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. మాంసాహారులైతే.. మాంసం, చికెన్, చేపలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
భోజన విరామంలో టీ, కాఫీలను పక్కన పెట్టేయాలి. వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా మార్చుకోవాలి. ఒత్తిడిని జయించడానికి ధ్యానం, యోగాను ఆశ్రయించాలి. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉన్నట్లయితే.. వైద్యుల సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. హిమోగ్లోబిన్, ఐరన్ స్థాయుల పరీక్షలను తరచుగా చేయించుకోవాలి.