కరీంనగర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనకు మంచి మిత్రుడని, తమ మధ్య సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ కలిసి పనిచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి పనులు, సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై బండి సంజయ్ సమయం తీసుకొని మరోసారి సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.
అదే తన ఢిల్లీ పర్యటనపైనా రేవంత్ స్పందించారు. 78 సార్లు ఢిల్లీకి వెళ్లానని అంటున్నారని, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఎన్నిసార్లయినా ఢిల్లీకి వెళ్తానని స్పష్టంచేశారు. బుధవారం కరీంనగర్లో రూ.51 కోట్లతో నిర్మించిన కరీంనగర్ సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన ప్రారంభించారు. కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ చిత్రా మిశ్రాను ఆమె సీటులో కూర్చోబెట్టి సన్మానించారు.