జీడిమెట్ల, డిసెంబర్ 30: నూతన సంవత్సర వేడుకల కోసం గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను బాలానగర్ పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. షాపూర్‌నగర్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సందీప్ గోనె వివరాలను వెల్లడించారు. జగద్గిరిగుట్టకు చెందిన దూదె అఖిల్ సంజయ్‌కుమార్ (22), జవహర్‌నగర్‌కు చెందిన గాజుల పరమేశ్ (20).. ఢిల్లీ, గోవా, చెన్నై తదితర ప్రాంతాల్లో డార్క్ వెబ్ సైట్ ద్వారా సరఫరాదారులను సంప్రదించి.. క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు పంపి.. గంజాయి, 44 ఎల్ఎస్డీ డ్రగ్స్ పేపర్స్ (చాక్లెట్, బిస్కెట్, జెల్లీ, హైబ్రిడ్ రూపంలో చేసిన గంజాయి)ని కొనుగోలు చేస్తారు. పలు ప్రాంతాల్లో పరిచయం ఉన్న స్నేహితులు, విద్యార్థులకు విక్రయిస్తుంటారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మత్తు పదార్థాలను అమ్మాలని ప్రయత్నిస్తూ..ఆల్విన్‌కాలనీ రోడ్డులో బాలానగర్ ఎస్వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, పట్టుబడ్డారు. రూ.10 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకొని..నిందితులను రిమాండ్‌కు తరలించారు.