హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే తాను దేనికైనా రెడీ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో వివిధ పద్దులపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు రాష్ట్రం అనుసరిస్తున్న ఎక్సైజ్ విధానంపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గుడుంబాను నిషేధించటం గొప్ప విషయం అని కితాబిస్తూనే, రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైన్‌షాపులే ఉన్నాయని, ఏ పాన్‌షాప్‌లో చూసినా, ఏ కిరాణ షాపులో చూసినా మద్యం అందుబాటులో ఉన్నదని వ్యాఖ్యానించారు. శ్రీధర్‌బాబు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ సభ్యులు పెద్దఎత్తున బల్లలు చరిచారు. ఈ క్రమంలో స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు కలుగజేసుకొని.. ఎక్సైజ్ మంత్రిగా తాను పనిచేసిన అనుభవంతో చెప్తున్నానని.. ఇష్టం వచ్చినట్టు, ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మరని చెప్పారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ లేచి శ్రీధర్‌బాబు వ్యాఖ్యలను ఖండించారు. ‘ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్దాం. వంద పాన్‌షాప్‌లు, వంద కిరాణషాప్లను చూద్దాం. హైదరాబాద్‌లో కానీ, మరోచోట కానీ పాన్‌షాప్‌లో లిక్కర్ అమ్ముతున్నారని తేలితే, మీరు ఏది చెప్తే అది నేను చేస్తా, దేనికైనా రెడీ’ అని సవాల్ విసిరారు. గత ప్రభుత్వాల కాలంలో లిక్కర్ దందా వల్ల నాయకుల జేబుల్లోకి డబ్బులు పోతే, సీఎం కేసీఆర్ నిర్ణయాలతో ప్రభుత్వానికే ఆదాయం వస్తున్నదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ జమానాలో నాయకులను సంతృప్తి పరిచేందుకు కాంట్రాక్టులు ఇచ్చేవారని, పేకాట క్లబ్బులు, గుడుంబా గబ్బును ప్రోత్సహించారని మండిపడ్డారు. పెడదారి పడుతున్న సమాజాన్ని రక్షించేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పేకాట క్లబ్బులకు స్థానం లేకుండా చేశారని స్పష్టం చేశారు.