వర్ధన్నపేట, సెప్టెంబర్ 20 : పోస్టుమార్టం కోసం భద్రపరిచిన శవం కన్ను పైభాగాన్ని ఎలుకలు పీక్కుతిన్న అమానుష ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఏరియా వైద్యశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన గారె వీరయ్య(58) శనివారం రాయపర్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు కేసు విచారణలో భాగంగా వర్ధన్నపేట ఏరియా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. డ్యూటీ వైద్యులు సమయం దాటిపోవడంతో వెళ్లిపోయారు. దీంతో పోలీసులు సంగెపువాగు వద్ద ఉన్న పోస్టుమార్టం గదిలో శవాన్ని భద్రపరిచారు.
పోస్టుమార్టం గదిలో విద్యుత్, ఫ్రీజర్, ఇతర వసతులు లేకపోవడంతో రాయపర్తి పోలీసులు సిబ్బందితో మాట్లాడి వీరయ్య శవాన్ని బల్లపై ఉంచి గదికి తాళం వేయించి వెళ్లిపోయారు. పోస్టుమార్టం గదిలో వసతులు లేవని చెప్పినా వినకుండా రాయపర్తి పోలీసులు వేరే అవకాశం లేకపోవడంతో శవాన్ని పీఎం గదిలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు వైద్యులు వీరయ్య శవానికి పోస్టుమార్టం చేసేందుకు గది తాళం తీసి వెళ్లి శవాన్ని పరిశీలించడంతో కన్ను పైభాగంలో ఎలుకలు పీక్కొని తిన్నట్టు కనిపించింది. ఈ దృశ్యాన్ని స్థానికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.