‘వారణాసి’ సినిమాలో మహేష్‌బాబు నటనపై చిత్ర దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. సినిమా ఆరంభానికి ముందు మహేష్‌బాబు నుంచి ఉత్తమ నటన రాబట్టుకోవాలనే ఆలోచన ఉండేదని, అయితే సెట్లోకి ఎంటరయ్యాక అత్యుత్తమ ప్రదర్శనతో తనను ఆశ్చర్యపరిచారని రాజమౌళి కొనియాడారు. ‘రుద్ర’ పాత్రలో మహేష్‌బాబు చూపిస్తున్న అంకితభావం అంచనాలను మించిపోయిందని, తాను 100శాతం ఆశిస్తే మహేష్‌బాబు ఏకంగా 200శాతం ఇచ్చాడని రాజమౌళి కితాబిచ్చారు.
అమెరికాలోని పెన్‌స్టేట్ యూనివర్సిటీ ఫిల్మ్‌స్కూల్ విద్యార్థులతో మాట్లాడిన రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేశారు. హీరోల ఎంపికలో తాను స్టార్డమ్కు అస్సలు ప్రాధాన్యత ఇవ్వనని, పాత్రకు సరిపోయే నటులనే ఎంపిక చేసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ‘రుద్ర పాత్రలో మహేష్ అభినయం నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఓ రకంగా ఆయన పాత్రలో జీవించారు. ఇదొక ప్రత్యేక అనుభవం’ అంటూ రాజమౌళి ఆనందాన్ని వ్యక్తం చేశారు. యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో మహేష్‌బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నారు.
వారణాసి నుంచి అంటార్కిటికా, ఆఫ్రికా, పురాతన రోమ్..ఇలా భిన్న ప్రాంతాలు, భిన్న కాల వ్యవధుల్లో నడిచే సాహసగాథగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.