Section Controller | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 119 పోస్టులను భర్తీ చేయనున్నది. రైల్వేలో వేగవంతమైన నిర్ణయాలు, సమయపాలనతో రైళ్ల రాకపోకల నిర్వహణలో అత్యంత కీలకమైన కొలువు ఈ సెక్షన్ కంట్రోలర్. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ ఆగస్టు 14.
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా కంటిచూపులో భాగంగా దూరం చూపు అద్దాలు లేకుండా 6/9, 6/9, దగ్గరి చూపు అద్దాలు లేకుండా 0.6, 0.6 ఉండాలి. కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మయోపిక్ విజన్ పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. లాసిక్ సర్జరీ లేదా ఇతర కంటి సర్జరీలు చేయించుకున్నవారు ఈ పోస్టుకు అర్హులు కారు. వయస్సు జూలై 1 నాటికి 20 నుంచి 33 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
నాలుగు దశల్లో ఎంపిక ఉంటుంది. మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT). ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. 120 నిమిషాల్లో పరీక్ష రాయాలి. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్‌లో 1/3వ వంతు మార్కులు తగ్గిస్తారు. రెడో దశ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT). సీబీటీ మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 1:8 నిష్పత్తి చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనిలో క్వాలిఫై కావడానికి ప్రతి టెస్ట్ బ్యాటరీలో కనీసం 42 మార్కుల T-స్కోర్ సాధించాలి. నెగెటివ్ మార్కింగ్ లేదు. మూడోది డాక్యుమెంట్ వెరిఫికేషన్. తుది జాబితాను సీబీటీ స్కోరుకు 70 శాతం వెయిటేజీ, సీబీఏటీ స్కోరుకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నాలుగోది మెడికల్ ఎగ్జామ్. రైల్వే అడ్మినిస్ట్రేషన్ నిర్వహించే వైద్య పరీక్షల్లో అర్హత సాధించాలి.
జీతం
ఏడో సీపీసీ ప్రకారం లెవల్-6 ప్రకారం ప్రారంభ బేసిక్ పే రూ. 35,400. ఉంటుంది. ఇతర వివరాలు తెలుసుకోవడానికి https://www.rrbapply.gov.in వెబ్‌సైట్‌ను చూడండి.