ఒకప్పుడు షాపింగ్ సందడి అంటే.. పండుగలకో, శుభకార్యాలకో మాత్రమే కనిపించేది. కానీ, జెన్-జెడ్ మాత్రం.. నిత్య షాపింగ్ మంత్రం పఠిస్తున్నది. అయితే, అన్నిటికీ ఆన్లైన్ మీదే ఆధారపడే ఈ తరం.. విచిత్రంగా షాపింగ్ కోసం ఆఫ్‌లైన్ స్టోర్లకు క్యూ కడుతున్నది. పేమెంట్ టెక్నాలజీ కంపెనీ.. ‘అడియన్’ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 18 నుంచి 27 ఏండ్ల వయసుగల వారిలో దాదాపు మూడు వంతుల మంది (73 శాతం).. కనీసం వారానికి ఒకసారైనా ఆఫ్‌లైన్ స్టోర్లను సందర్శిస్తారట. ఈ విషయంలో బేబీ బూమర్లు (1946-1964 మధ్యలో పుట్టినవారు) 65 శాతం మాత్రమే ఉన్నారట. ఈ సర్వేలో పాల్గొన్న జెన్-జెడ్ షాపర్లలో దాదాపు సగం మంది (49 శాతం) ఆన్లైన్లో కొనుగోలు చేస్తూ.. ఆయా సంస్థలకు చెందిన స్టోర్ల నుంచి డెలివరీ పొందుతున్నారట. అదే.. బేబీ బూమర్ల విషయానికి వస్తే.. 28 శాతం మంది మాత్రమే ఇలా ఆన్లైన్లో కొనుగోలు చేసి, స్టోర్ల నుంచి డెలివరీ తీసుకుంటున్నారట. ఇలా.. ఆఫ్‌లైన్ స్టోర్లను సందర్శించి, నచ్చిన వస్తువును కొనుగోలు చేయడం మంచి అనుభవమని 57 శాతం మంది చెబుతున్నారు. అదే సమయంలో.. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయడం కూడా తమకు సౌకర్యంగా ఉంటుందని జెన్-జెడ్ అంటున్నది.
ముఖ్యంగా, ఖరీదైన వస్తువులను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తామని 38 శాతం మంది చెప్పగా.. ఇందుకు భిన్నంగా ఆఫ్‌లైన్ స్టోర్లను ఆశ్రయిస్తామని 37 శాతం మంది చెప్పారు. ‘డిజిటల్ ప్రపంచంలోనే బతుకుతారు’ అనే పేరు తెచ్చుకున్న జెన్-జెడ్.. షాపింగ్ విషయానికి వచ్చేసరికి ఆ హద్దులను చెరిపేస్తున్నారని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు. ఎందుకంటే.. వారు చాలా వేగవంతమైన, ఒత్తిడి లేని షాపింగ్ అనుభవాన్ని కోరుకుంటున్నారట. మరో విషయం ఏమిటంటే, స్టోర్లలో షాపింగ్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. జెన్-జెడ్ తరం కొన్ని నిబంధనలను పాటిస్తున్నది. బిల్లింగ్ దగ్గర ఆలస్యమైనా.. చెక్ అవుట్ లైన్లు పొడవుగా ఉన్నా.. షాపింగ్‌ను వదిలేస్తున్నారట. అంటే.. అప్పటిదాకా సెలెక్ట్ చేసుకున్న దుస్తులు, వస్తువులను అక్కడే వదిలేసి వెళ్తున్నారట. అలా.. క్యూ లైన్లలో వేచి ఉండటం ఇష్టంలేక షాపింగ్‌ను వదిలేస్తున్నట్లు 60 శాతం మంది చెప్పారు. తమకు ఇష్టమైన చెల్లింపు పద్ధతులు (క్రెడిట్ కార్డ్, యూపీఐ) లాంటివి అందుబాటులో లేకున్నా.. వీరు షాపింగ్ వదిలేస్తారట.