హనుమకొండ సబర్బన్/భీమదేవరపల్లి, జూలై 27: విజ్ఞాన కేంద్రాలుగా గ్రంథాలయాలు విరాజిల్లుతున్నాయని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ప్రజాగ్రంథాలయం-నమస్తే తెలంగాణ దినపత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విపరీత పోకడలు ఎక్కువయ్యాయని తెలిపారు. పూర్వం నానమ్మలు, తాతయ్యలు.. పిల్లలకు మంచి విలువలతో కూడిన కథలు చెప్తుండేవారని, పిల్లలు మంచి బుద్ధులు అలవర్చుకునేవారని తెలిపారు.
అప్పట్లో పిల్లలకు మంచి పుస్తకాలు, దినపత్రికలను చదివే అలవాటు ఉండేదని, వీటివల్ల కూడా మంచి గుణాలు అబ్బేవని గుర్తుచేశారు. ముల్కనూరు ప్రజాగ్రంథాలయం – నమస్తే తెలంగాణ దినపత్రిక జాతీయ స్థాయి కథల పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా కనుమరుగవుతున్న సాహితీ కుసుమాలను వెలికితీసినట్టవుతుందని తెలిపారు. ఈ ఏడాది కవితల పోటీల్లో 470 మంది కథలను పంపగా వాటిలో 70 కథలను నిర్వాహకులు ఎంపిక చేసి, విజేతలకు బహుమతులు అందజేశారు.
ముల్కనూరు ప్రజాగ్రంథాలయం మాదిరిగానే అన్ని గ్రంథాలయాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార బ్యాంక్ చైర్మన్ అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ముల్కనూరు ప్రజాగ్రంథాలయం తెలుగు సాహిత్యాన్ని పెంచి పోషిస్తున్నదని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటూ ఒత్తిడి చేయకుండా తెలుగును కూడా నేర్చుకునేలా కథల పుస్తకాలను చదివించాలని సూచించారు. ముల్కనూరు ప్రజాగ్రంథాలయం, నమస్తే తెలంగాణ దినపత్రిక నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలకు రెండు రాష్ర్టాల నుంచి కథకులు రావడం సంతోషంగా ఉందని చెప్పారు.
సమాజంలో మానవత్వం పెరగాలంటే సాహిత్యం బతకాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎంవో ఓఎస్డీ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం వ్యవస్థాపక సభ్యుడు వేముల శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. ముల్కనూరు ప్రజా గ్రంథాలయం ఏర్పాటుకు తమ మిత్రులంతా ఇతోధికంగా సహాయపడ్డారని గుర్తుచేశారు. కథల పోటీలు నిర్వహిస్తామని చెప్పినప్పుడు నమస్తే తెలంగాణ దినపత్రిక ఎంతగానో ప్రోత్సహించిందని తెలిపారు. ప్రజాగ్రంథాలయంలో పుస్తకాలను చదువుకున్న వారిలో 30మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో సివిల్స్ సాధించేలా కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తామని ధీమా వ్యక్తంచేశారు.
తెలుగు భాషకు నారం అనే పదాన్ని అందించిన కీర్తి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలకు దక్కుతుందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ తెలిపారు. కురిక్యాల, మహబూబాబాద్ శాసనాల ద్వారా తెలుగు భాష ఎంతటి పురాతనమైనదో తెలుస్తుందన్నారు. ముల్కనూరు ప్రజాగ్రంథాలయం – నమస్తే తెలంగాణ దినపత్రిక కలిసి నిర్వహిస్తున్న యత్నం అసాధారణమైనదని కొనియాడారు.
విత్తనాలను సరఫరా చేయడం ద్వారా ప్రపంచానికే ముల్కనూరు ప్రాంతం అన్నం పెడుతున్నదని కవి అందెశ్రీ తెలిపారు. ముల్కనూరు సహకార గ్రామీణ సంఘం, మహిళా సహకార డెయిరీ పేర్లు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతుండగా.. రానున్న రోజుల్లో కథలను ప్రోత్సహించే ప్రాంతంగా కూడా ముల్కనూరు ప్రజాగ్రంథాలయం ప్రసిద్ధి కెక్కనున్నదని ఆకాంక్షించారు. నమస్తే తెలంగాణ దినపత్రిక రథచక్రంగా పనిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రస్తుత బిజీ ప్రపంచంలో దినపత్రికలను చదివే సమయాన్ని కూడా చాలామంది కేటాయించలేకపోతున్నారని నమస్తే తెలంగాణ నెట్వర్క్ ఇన్చార్జి ఎస్జీవీ శ్రీనివాసరావు అన్నారు. అరచేతిలోకి అంతర్జాలం రావడమే ప్రధాన కారణమని తెలిపారు. ఇలాంటి తరుణంలో కథల పోటీలను నిర్వహించడం ద్వారా సాహిత్యాన్ని బతికించే ప్రయత్నం విజయవంతంగా నడుస్తున్నదని చెప్పారు. కనుమరుగవుతున్న సాహిత్యాన్ని ప్రోత్సహించేలా రెండు రాష్ర్టాల నుంచి కవులు, రచయితలు పెద్దఎత్తున రావడం ఆనందంగా ఉన్నదని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే కథలు చదివే అలవాటు చేయాలని సూచించారు. పత్రిక ఆవిర్భావం నుంచి కథలను ప్రోత్సహించే విషయంలో నమస్తే తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని, రానున్న రోజుల్లోనూ మరింతగా ప్రోత్సహిస్తుందని చెప్పారు.