వనపర్తి, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అఖండ మెజారిటీతో గెలిపించి మళ్లా కేసీఆర్‌ను సీఎంగా చూడాలన్న కోరిక రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ‘సర్’ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌తో కలిసి హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పని చేయాలని పిలుపునిచ్చారు. మూడు నెలలపాటు కొనసాగే ‘సర్’ ప్రక్రియలో మొదటి నెల అత్యంత ప్రాముఖ్యమైనదని తెలిపారు. పార్టీ ఏజెంట్లతోపాటు నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొని పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. ‘సర్’ను బూచీగా చూపించి ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్నదని, ఇందులో బూతు లెవెల్ ఏజెంట్లు అత్యంత కీలకంగా వ్యవహరించాలని అన్నారు.