వాషింగ్టన్, మే 13 : అమెరికాలో ఉన్నత చదువులు పూర్తిచేసుకున్న (ఎఫ్-1 వీసా) విదేశీ విద్యార్థులు, అక్కడ పని అనుభవం సంపాదించడానికి అనుమతించే విధానమే ‘ఓపీటీ’ (ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రెయినింగ్). ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సుమారు 10,000 మందిపై అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) నిఘా పెట్టింది. ఓపీటీ మోసాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లలో పలువురు భారతీయులు కూడా ఉన్నారని తెలిపింది.
మంగళవారం ఐసీఈ డైరెక్టర్ టాడ్ లయన్స్ మీడియాతో మాట్లాడుతూ, ఓపీటీ కార్యక్రమం మోసాలకు ఒక ప్రధాన ఆకర్షణగా మారిందన్నారు. దీనిపై పలు ఏజెన్సీలు దర్యాప్తులు జరుపుతున్నాయని తెలిపారు. నకిలీ కన్సల్టెన్సీలు లేదా కంపెనీల ద్వారా పే-స్టబ్లు సృష్టించటం, నకిలీ యజమానులు, ఖాళీ ఆఫీసులతో ఉన్న కంపెనీలను అధికారులు గుర్తించారు. వీటి ద్వారా ఓపీటీ పొందిన వారిపై ఐసీఈ కఠిన
చర్యలు చేపట్టింది. ఆరోపణలు రుజువైతే వీసా రద్దు చేసి, అమెరికా నుంచి వెనక్కి పంపించేస్తారు. ఓపీటీ కార్యక్రమం మోసాలకు, జాతీయ భద్రతాపరమైన ఆందోళనలకు ప్రధాన కారణంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.