ములుగు, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : తొలకరి వర్షం.. అదికూడా చిన్నపాటి వానకే బ్రిడ్జిని ఆనుకొని ఉన్న రోడ్డు కుంగిపోయి సైడ్‌బర్మ్‌లు కూలిపోయాయి. ములుగు జిల్లా మల్లంపల్లి మండలకేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గతేడాది వానకాలంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టిన క్రమంలో బ్రిడ్జి కూలి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పందికుంట క్రాస్ నుంచి రామచంద్రాపురం మీదుగా శ్రీనగర్ వైపు ఫోర్విల్లర్స్, ద్విచక్రవాహనాలను, బస్సులు, భారీ వాహనాలను అబ్బాపూర్ నుంచి రేగొండ మీదుగా గుడెప్పాడ్ నుంచి హనుమకొండకు తరలించారు.
ఆ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. అయితే, ఆ సమయంలో శరవేగంగా బ్రిడ్జి నిర్మాణ పనులను మేడారం జాతర లోపు చేపడుతున్నామని చెప్పిన అధికారులు పనులను పూర్తి చేసి వాహనాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఒక వైపు నిర్మాణ పనులను పూర్తి చేశారు. నిన్న మొన్నటి వరకు బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాఫీగా సాగగా బుధవారం రాత్రి, గురువారం కురిసిన వర్షానికి బ్రిడ్జిని అనుకొని ఉన్న జాతీయ రహదారి కుంగిపోయింది.
దీంతో వాహనదారులు భయాందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు నిర్మాణ పనులు నాసిరకంగా జరిగాయని, పనులు జరిగిన సమయంలో అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేపట్టారని వాహనదారులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు బ్రిడ్జి నిర్మాణ పనులు సంవత్సర కాలంగా సాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అందులోకి రాకపోవడం వాహనదారులకు శాపంగా మారింది. ఎన్‌హెచ్‌పై బ్రిడ్జి నిర్మాణ పనులను శరవేగంగా పూర్తిచేయాల్సి ఉన్నా, పట్టించుకోకపోవడంతో రోడ్డు కుంగిపోయి గుంతలను తలపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి రాకపోకలు నిలిచిపోకముందే మరమ్మతు పనులను చేపట్టాలని పలువురు కోరుతున్నారు.