New Delhi : ఢిల్లీలో మొదటి మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. నార్త్ ఢిల్లీలోని సుబ్జి మండి ఏరియాలో ఏర్పాటు చేసిన ఈ మహిళా పోలీస్ స్టేషన్ను లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సందూ, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా శుక్రవారం ప్రారంభించారు. పూర్తిగా మహిళా పోలీసులు, సిబ్బందితోనే నడవడం ఈ పోలీస్ స్టేషన్ ప్రత్యేకత. పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సందర్భంగా ఎల్జీ తరంజిత్ సింగ్ మాట్లాడుతూ.. మహిళలు ఫిర్యాదు చేసేందుకు, సహాయం కోరేందుకు ఈ ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఉపయోగపడుతుందన్నారు.
రాబోయే రోజుల్లో ఢిల్లీ పరిధలోని ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై పోలీసు అధికారులు స్పందించారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు, వారి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. గృహహింస, లైంగిక వేధింపులు, నిఘా, దాడులు సహా మహిళలపై జరుగుతున్న అనేక నేరాలపై దృష్టి పెట్టేందుకు మంచి అవకాశం దొరుకుతుందన్నారు. నేరాల్ని అడ్డుకోవడం, విచారణ, పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తామన్నారు. బాధితుల కోణంలో పని చేస్తామన్నారు. కేసు విచారణ జరిపే పోలీసుల దగ్గరి నుంచి సపోర్టింగ్ స్టాఫ్ వరకు మొత్తం మంది మహిళలే ఉండటం ఈ పోలీస్ స్టేషన్ ప్రత్యేకత. అధికారి స్థాయి నుంచి కింది స్థాయి వరకు సిబ్బంది అందరూ మహిళలే.
ఇదే సమయంలో జనం సమస్యలు వినేందుకోసం ‘జన్ సున్వాయి’ కార్యక్రమాన్ని కూడా ఎల్జీ తరంజిత్ సింగ్ ప్రారంభించారు. ఢిల్లీ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు, వారికి సులభంగా పోలీసులు అందుబాటులో ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇక్కడ సీనియర్ ఉన్నతాధికారులు అందుబాటులో ఉండి సమస్యల్ని త్వరగా పరిష్కరిస్తారని చెప్పారు. పోలీసింగ్ కంటే, కౌన్సెలింగ్, అవేర్నెస్ కల్పించడమే తమ ఉద్దేశ్యమన్నారు.