e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News గూడు చెదిరి.. గుండె తడి

గూడు చెదిరి.. గుండె తడి

  • కూలి పనులు చేస్తూనే డిగ్రీ పూర్తి… ఉద్యోగం చేయాలనే ఆకాంక్ష
  • చిన్నతనంలోనే అనారోగ్యంతో తండ్రి మృతి
  • మంచానికే పరిమితమైన తల్లికి 11 ఏళ్లుగా సపర్యలు
  • ఇంటి నిర్మాణానికి సహాయం చేయాలని వేడుకోలు
  • చదువు మాని,కూలి పనులు చేసి సాకుతున్న కూతురు
  • ఊరి చివరన పూరి గుడిసెలో జీవనం
  • గాలివాన వచ్చినా, విషపురుగు కనిపించినా ఆ రాత్రి జాగారమే..
  • పింఛన్‌ డబ్బులు, రేషన్‌ బియ్యమే ఆసరా

ఊహ తెలియక ముందే తండ్రిని కోల్పోయింది. అండగా ఉండాల్సిన సమయంలో తల్లి అనారోగ్యంతో మంచం పట్టింది. తోడుగా ఉంటుందనుకున్న అక్క అకాల మరణం చెందింది. పూట గడువడమే కష్టమైన పరిస్థితుల్లో.. చదువుకోవాలన్న ఆశను, ఉద్యోగం చేయాలన్న ఆశయాన్ని వదిలేసి కూలీగా మారి, కుటుంబ బాధ్యతను ఆమె భుజానికి ఎత్తుకున్నది. రోజు కూలి అమ్మ మందులకు సరిపోతుండగా, ప్రభుత్వం ఇస్తున్న పింఛన్‌, రేషన్‌తో ఇంటిని నెట్టుకొస్తున్నది. అంతకుమించిన కష్టం ఇప్పుడా తల్లీబిడ్డను వేధిస్తున్నది. సెంటు జాగా కూడా లేకపోవడంతో ఊరి చివరన గ్రామపంచాయతీ ఇచ్చిన స్థలంలో గుడిసె వేసుకుని ఉంటుండగా, ఎప్పుడు కూలుతుందో తెలియనట్టు తయారైన గుడిసెలోకి తరుచూ తేళ్లు, పాములు వస్తుండడంతో బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. గాలివాన వస్తే చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఈ బతుకు బతుకడం కన్నా చనిపోతే బాగుండంటూ కండ్ల నీళ్లు తీస్తున్నారు సంస్థాన్‌నారాయణపురం మండలం గుజ్జ గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు అమనూరి శ్యామలమ్మ, కల్పన. దాతలు స్పందించి ఇంటి నిర్మాణానికి సాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు.
-సంస్థాన్‌ నారాయణపురం, నవంబర్‌ 24

నా అన్న వాళ్లందరూ ముఖం చాటేశారు. తోడుగా ఉంటుందనుకున్న అక్క కూడా కన్నుమూసింది. పట్టెడన్నం దొరకడం కూడా కష్టంగా మారింది. దిక్కుతోచని స్థితిలో ఒక పూట తిని మరోపూట పస్తులుండి నిద్ర లేని రాత్రులు గడిపింది. సమస్యలన్నీ తొలిగిపోవాలంటే చదివి ఉద్యోగం సాధించడం ఒక్కటే పరిష్కారం అనుకుంది. మంచానికే పరిమితమైన తల్లికి సపర్యలు చేస్తూ మరో వైపు కూలి పనులు చేస్తూనే కష్టపడి బీఎస్సీ పూర్తి చేసింది. టీచర్‌ ఉద్యోగం చేయాలని కలలు గన్నది. కానీ.. పంట పొలాల మధ్యలో ఉన్న పూరి గుడిసెలోకి తరచూ పాములు, తేళ్లు వస్తుండడంతో తల్లిని వదిలి ఉండలేక తనకు ఇష్టమైన చదువును, తన కలలను వదిలేసుకుంది.

- Advertisement -

గుజ్జ గ్రామానికి చెందిన అమనురి శ్యామలయ్య, మల్లయ్య నిరుపేద దంపతులు. కూలి పనులు చేస్తూ బతికేవాళ్లు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. 20 ఏండ్ల క్రితం మల్లయ్య అనారోగ్యంతో చనిపోయాడు. శ్యామలమ్మ కూలి పనులు చేస్తూ పిల్లలను పోషించింది. భర్త చనిపోయిన ఐదేండ్లకే రెండో కూతురు కూడా అనారోగ్యంతో కన్నుమూసింది. కష్టపడి పెద్ద కూతురు పెళ్లి చేసింది. అప్పులు, సమస్యలు పెరిగి పోవడంతోపాటు నరాల బలహీనతతో శ్యామలమ్మ మంచానికే పరిమితమైంది. నెలనెలా వచ్చే రేషన్‌ బియ్యం, పింఛన్‌ డబ్బులే ఆ ఇంటికి దిక్కయ్యాయి. చిన్న కూతురు కల్పన కుటుంబ భారం మోస్తూ 11ఏండ్లుగా తల్లికి సపర్యలు చేస్తున్నది. ఉద్యోగం సాధిస్తేనే తమ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని కష్టపడి చదివింది. ఓ వైపు కూలి పనులకు వెళ్తూనే బీఎస్సీ పూర్తి చేసింది. బీఈడీ పూర్తి చేసి టీచర్‌ ఉద్యోగం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. ఆర్థిక పరిస్థితులు, తల్లి అనారోగ్యంతో మంచానికి పరిమితం కావడంతో చదువును ఆపేసి కూలి పనులకు వెళ్తున్నది. తన ఇష్టాలు, కోరికలన్నింటినీ వదిలేసుకొని కూలి డబ్బుతో తల్లికి వైద్యం చేయిస్తున్నది. తల్లి వైద్యం కోసం ఇప్పటికి రూ.2లక్షల వరకు అప్పు అయ్యిందని, దానికి తోడు ఉన్న గుడిసె కూడా కూలిపోయే స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ని సమస్యల మధ్య బతకడం కన్నా చనిపోయినా బాగుండు అంటూ బోరున విలపించింది.

శిథిలావస్థలో గుడిసె..

కుటుంబానికి సెంటు భూమి కూడా లేకపోవడంతో ఊరి చివరన గ్రామపంచాయతీ వారు ప్రభుత్వ భూమిని కేటాయించారు. అందులో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కంప చెట్లు, పంట పొలాల మధ్య ఇల్లు ఉండడంతో తరచూ పాములు, తేళ్లు వస్తున్నాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నారు. పాముల భయానికి రాత్రి పూట ఒకరు నిద్రపోతే మరొకరు జాగారం చేయవలిసిన పరిస్థితి. గుడిసె పూర్తిగా శిథిలాస్థకు చేరుకోవడంతో వర్షం వచ్చినప్పుడు తడుస్తూనే తల దాచుకుంటున్నారు.

అమ్మను వదిలి వెళ్లలేకపోతున్నా ..

కూలి పనులకు వెళ్లి సంపాదించిన డబ్బులు అమ్మ మందులకు, తిండి ఖర్చులకే సరిపోవడం లేదు. వర్షం వస్తే గుడిసె మొత్తం కురుస్తుంది. ఉద్యోగం చేయాలని ఉన్నా ఇంట్లోకి వస్తున్న పాముల భయానికి అమ్మను వదిలి దూరం వెళ్లలేకపోతున్న. అమ్మ కోసం ఎన్ని రోజులైనా కష్టపడుతా. ఇంటి నిర్మాణం కోసం సహాయం చేస్తే చాలు. ఉద్యోగం చేసి అమ్మను బాగా చూసుకుంటా.

నా బిడ్డ బాధలు చూడలేకపోతున్నా..

నా బిడ్డ బాగా చదువుతుంది సారు. కానీ.. నా కోసం చదువు ఆపేసింది. కూలి పనులు చేసి నన్ను దవాఖానలో చూపిస్తుంది. నా కోసం నా బిడ్డ పడుతున్న బాధలు చూడలేకపోతున్న. నాకు సావు వచ్చినా బాగుండు. గుడిసెలో ఉంటున్నామని బిడ్డకు పెళ్లి సంబంధాలు కూడా వస్తలేవు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement