‘ప్రకృతిని ఇష్టపడే యువకుడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఆ ప్రేమ వల్ల అతను ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నాడు? చివరకు ప్రేమను గెలుచుకున్నాడా? లేదా? అన్నదే మా ‘నేచర్’ సినిమా కథాంశం’ అన్నారు అశ్విన్ కామరాజు కొప్పల. ఆయన దర్శకత్వంలో కృష్ణ, ముస్కాన్ రాజేందర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సి. యశోదమ్మ, టి. చేతన్ నిర్మించారు. ఈ సినిమాలోని ‘నిన్నే చూడందే’ అనే లిరికల్ సాంగ్‌ను హాస్య నటుడు ఆలీ విడుదల చేశారు.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ప్రకృతి బాగుంటే అన్నీ బాగుంటాయి. ఎలాంటి విపత్తులు రాకుండా ప్రజలందరూ సంతోషంగా ఉంటారనే అంశాన్ని ప్రేమకథా నేపథ్యంలో చూపించాం’ అన్నారు. కథా రచయితలు సుధాకర్ తుపాకుల, రవి చల్ల మాట్లాడుతూ ‘సమాజంలోని ప్రతి ఒక్కరు ప్రకృతిని కాపాడే బాధ్యతను తీసుకోవాలనే చక్కటి సందేశంతో ఈ కథ రాశాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ ఠాగూర్, సంగీతం: ఎం.ఎల్.రాజా, నిర్మాణ సంస్థ: శ్రీసప్తమ్ క్రియేటివ్ ప్రొడక్షన్స్.