Nani | సోషల్ మీడియా యుగంలో సినిమా మేకర్స్‌కి లీకులు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. ఎంతటి జాగ్రత్తలు తీసుకున్నా… సెట్స్ నుంచి ఫోటోలు, వీడియోలు బయటకి రావడం ఇప్పుడు నిత్యకృత్యంగా మారింది. తాజాగా ‘ది పారడైజ్’ సినిమాకి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకు రావడంతో మేకర్స్ గుర్రుగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది పారడైజ్’ చిత్రం నుంచి తాజాగా ఓ కీలక ఫోటో లీక్ అయింది. జైలు సెటప్‌లో గోడపై బొగ్గుతో డ్రాయింగ్ లా ఉన్న సీనియర్ నటుడు మోహన్ బాబు స్కెచ్ తో పాటు ఆయన వింటేజ్ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోతో పాటు ఇంకో రెండు ఇమేజ్‌లు కూడా నెట్టింట దర్శనమిచ్చాయి.
మోహన్ బాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు లీకైన ఫోటో ఆ వార్తలకు బలాన్నిచ్చింది. ‘ది పారడైజ్’ మాత్రమే కాదు… ఇటీవల SSMB 29, వార్ 2, ది రాజాసాబ్ వంటి భారీ ప్రాజెక్టులు కూడా లీకుల బారిన పడ్డాయి. మహేష్ బాబు – రాజమౌళి సినిమా షూటింగ్ ఒడిశా ప్రాంతంలో జరిగినప్పుడు కొన్నిసన్నివేశాలు బయటకు వచ్చాయి. తారక్ – హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 నుంచి ఫైటింగ్ సీన్ స్టిల్స్, లుక్స్ లీక్ అయ్యాయి. ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
ఇలాంటివి సినిమా టీమ్ కష్టాన్ని, ప్రమోషన్ స్ట్రాటజీని దెబ్బతీసేలా ఉన్నాయి. “ఇప్పటికైనా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ పలువురు సలహాలు ఇస్తున్నారు. ది ప్యారడైజ్ సినిమాను సుధాకర్ చెరుకూరి తన SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ తో నాని క్యారెక్టర్‌ను పరిచయం చేశారు కానీ మిగిలిన ప్రధాన పాత్రల వివరాలు ఇంకా బయటపెట్టలేదు. త్వరలోనే కథానాయికతో పాటు ఇతర ముఖ్య పాత్రల వివరాలు ప్రకటించనున్నట్టు సమాచారం. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ఈ చిత్రంలో యూనిక్ పాత్రలో నటిస్తున్నట్టు మేకర్స్ కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. ఈ పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతోందని అంటున్నారు.