మళ్లీ చదువులబాటలోకి చెంచు యువతి
చెంచు యువతి మళ్లీ చదువులబాట పట్టనున్నది. చదువుకోవాలనే ఆశ ఉన్నా.. పేదరికం వెంటాడింది.. డాక్టర్ కావాలనే కల ఉన్నా.. కార్పొరేట్ కళాశాల యాజమాన్యం వైఖరి అడ్డంకిగా మారింది.
- విద్యార్థిని ఉన్నత విద్యకు పూర్తి సహకారం అందిస్తాం
- ప్రభుత్వంతో మాట్లాడి నీట్ కోచింగ్
- మన్ననూర్ ఐటీడీఏ పీవో సలోని
- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన
- కృతజ్ఞతలు తెలిపిన వెంకటలక్ష్మి
అచ్చంపేట, నవంబర్ 6: చెంచు యువతి మళ్లీ చదువులబాట పట్టనున్నది. చదువుకోవాలనే ఆశ ఉన్నా.. పేదరికం వెంటాడింది.. డాక్టర్ కావాలనే కల ఉన్నా.. కార్పొరేట్ కళాశాల యాజమాన్యం వైఖరి అడ్డంకిగా మారింది. చివరికి చేతిలో సర్టిఫికెట్లు లేక ఉన్నత చదువులకు దూరమై అడవిబాట పట్టిన ఓ చెంచు యువతి దీనస్థితిని వివరిస్తూ ఈ నెల ఒకటో తేదీన ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచుబాలిక కల’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనం అధికారుల దృష్టిని ఆకర్షించింది. దీంతో కలెక్టరేట్, గిరిజిన సంక్షేమశాఖ, ఐటీడీఏతోపాటు ఇతర శాఖల అధికారులు స్పందించారు.
అక్షరదీపం ఆరిపోకుండా..
నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం కొమ్మన్పేంట చెంచు గ్రామానికి చెందిన ఆర్తి వెంకటలక్ష్మి హైదరాబాద్‌లోని ఆర్టీడీ సంస్థ సహకారంతో పీర్జాదిగూడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసింది. అనంతరం ఉన్నత చదువుల కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని సదరు కళాశాల యాజమాన్యాన్ని ఆశ్రయించింది. అదనపు ఫీజు బకాయిలు ఉన్నాయంటూ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. తీవ్ర పేదరికంలో ఉన్న వెంకటలక్ష్మి ఆ బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉండటంతో ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకుండాపోయింది.
ఈ లోగా డిగ్రీ ప్రవేశాల గడువు ముగియడంతో ఉన్నత చదువుల ఆశలు ఆవిరయ్యాయి. చేసేదేమిలేక తిరిగి స్వగ్రామానికి వెళ్లిన యువతి వ్యవసాయ కూలీగా మారింది. చీపురు పుల్లలు, అటవీ ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగిస్తున్నది. డాక్టర్ కావాలనే లక్ష్యం ఉన్నా పరిస్థితులు ఆమెను చదువుకు దూరం చేశాయి. ‘నమస్తే’ కథనంతో స్పందించిన అచ్చంపేట సబ్ కలెక్టర్, మన్ననూర్ ఐటీడీఏ పీవో సలోని ఛాబ్రా శుక్రవారం విద్యార్థిని తండ్రి ఆర్తి అంజయ్య, విద్యార్థిని వెంకటలక్ష్మిని మన్ననూర్లోని తన కార్యాలయానికి పిలిపించారు. కార్పొరేట్ కళాశాల యాజమాన్యంతో మాట్లాడి వెంకటలక్ష్మి ఒరిజినల్ సర్టిఫికెట్లు తెప్పించి ఆమెకు అందజేశారు. యువతి కుటుంబ స్థితిగతులతోపాటు ఉన్నత విద్య గురించి అడిగి తెలుసుకున్నారు.
నీట్ కోచింగ్ ఇప్పిస్తాం: పీవో
తనకు సర్టిఫికెట్లు అందడం ఒక్కటే సరిపోదని.. ఉన్నత చదువులకు సహకారం కావాలని వెంకటలక్ష్మి పీవోకు వినతిపత్రం అందజేసింది. నీట్ కోచింగ్ తీసుకొని డాక్టర్ కావాలని, తన గూడెంలోని పేద ప్రజలకు వైద్యసేవలు అందించాలనేది తన ఆశయమని వివరించింది. విద్యార్థిని పట్టుదలను చూసి చలించిన పీవో సలోచిఛాబ్రా సానుకూలంగా స్పందించారు. గిరిజన సంక్షేమశాఖ అధికారులతోపాటు ప్రభుత్వంతో మాట్లాడి నీట్ కోచింగ్ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వారం రోజుల్లో కోచింగ్‌లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఆదివాసీ విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే వెంకటలక్ష్మి ఎంతవరకు చదువాలనుకుంటే అంతవరకు చదివేందుకు తనవంతు కృషి చేస్తానని భరోసా కల్పించడంతో వెంకటలక్ష్మి ఆనందంలో మునిగిపోయింది. అధికారుల నుంచి కబురు అందగానే కోచింగ్ సెంటర్లో చేరి చదువుకుంటానని తెలిపింది. తన దీనస్థితిని వెలుగులోకి తీసుకువచ్చి.. తిరిగి చదువుకునే అవకాశం కల్పించేందుకు కృషి చేసిన ‘నమస్తే తెలంగాణ’కు వెంకటలక్ష్మి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

