NAM vs RSA : విండ్హోక్లోని నమీబియా (Namibia) క్రికెట్ గ్రౌండ్లో జరిగిన టీ20 ట్రై-నేషన్ సిరీస్ (T20 Tri-Nation Series) ఆరంభ మ్యాచ్‌లో పసికూన నమీబియా సంచలనం సృష్టించింది. పటిష్ఠమైన దక్షిణాఫ్రికా (South Africa) జట్టుపై 18 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టును 145/9 స్కోరుకే కట్టడిచేసి ఈ సిరీస్‌లో బోణీ కొట్టింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లలో నమీబియా తమ 2-0 ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. నమీబియా విజయంలో బౌలర్లు రూబెన్ ట్రంపెల్మన్, జేజే స్మిత్ కీలకపాత్ర పోషించి చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బ్యోర్న్ ఫోర్టుయిన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే నమీబియా ఓపెనర్లు లూరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు కేవలం 9.4 ఓవర్లలోనే 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్టీన్‌క్యాంప్ 41 పరుగుల వద్ద ఔటవ్వగా.. ఫ్రైలింక్ 60 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (19), అలెగ్జాండర్ బుసింగ్-వోల్షెంక్ (13), ట్రంపెల్మన్ (12) చేసిన చిన్నపాటి పరుగులు జట్టు స్కోరును 163/9 కి చేర్చడంలో తోడ్పడ్డాయి.
లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు జోర్డాన్ హెర్మన్ (7), లువాన్-డ్రే ప్రిటోరియస్ (9) తొలి నాలుగు ఓవర్లలోనే పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ బ్రెవిస్ 75 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే మరో ఎండ్‌లో వికెట్లు పడుతూనే ఉండటంతో దక్షిణాఫ్రికా 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్రెవిస్‌కు జత కలిసిన డువాన్ జాన్సెన్ 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టులో ఆశలు రేపాడు. చివరి 13 బంతుల్లో 31 పరుగులు అవసరమైన దశలో బ్రెవిస్‌ను ట్రంపెల్మన్ ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.
చివరి ఓవర్లో కెప్టెన్ ఎరాస్మస్ కేవలం మూడు పరుగులే ఇచ్చి ఫోర్టుయిన్ను ఔట్ చేశాడు. ఆఖరి ఓవర్ తొలి రెండు బంతులకు జాన్సెన్ (25 నాటౌట్) ఎనిమిది పరుగులు చేసి ఉత్కంఠ రేపినా.. స్మిత్ మిగిలిన బ్యాటర్లను ఔట్ చేసి నమీబియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దక్షిణాఫ్రికా నేడు జింబాబ్వేతో తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.