హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ.. ఎల్ నినో ప్రభావం వల్ల చాలాప్రాంతాల్లో చినుకుజాడ కరువైంది. వానకాలం సాగుపై రైతుల్లో ఆందోళన పెరుగుతున్నది. దేశంలో నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకినప్పటికీ, దేశంలోని చాలాప్రాంతాలు ఇంకా వర్షాల కోసం వేచి చూస్తున్నాయి. గత 146 ఏండ్ల వాతావరణ చరిత్రలో ఈ జూన్ నెల అత్యంత పొడిగా నమోదైన నెలల్లో ఒకటిగా నిలిచిందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. జూన్ 15 నాటికి దేశంలోని దక్షిణ, తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు, తర్వాత స్తంభించిపోయాయి. దేశంలోని చాలాప్రాంతాల్లో 40 శాతం తకువ వర్షపాతం నమోదయ్యింది. జూన్ నెల లోటును భర్తీ చేయడానికి కొంతసమయం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
వాతావరణంలో తేమ శాతం పెరుగడం వల్ల, సుదీర్ఘ పొడికాలం తర్వాత అకస్మాత్తుగా కురిసే భారీవర్షాలు, వరదలు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్ జిల్లా మరిపెడలో 8.35 సెం.మీ, కరీంనగర్ జిల్లా రామడుగులో 6.94 సెం.మీ, కరీంనగర్ రూరల్‌లో 6.15 సెం.మీ, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో 5.20 సెం.మీ, మెట్పల్లిలో 4.31 సెం.మీ, కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లో 5.20 సెం.మీ, సూర్యాపేట జిల్లా మద్దిరాళ్లలో 4.09 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయినట్టు అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ, జూన్ 28: దేశంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ ముఖం చాటేశాయి. జూన్ 4 నుంచి 28 మధ్య సాధారణంగా 141.4 ఎంఎం వర్షం కురువాల్సి ఉండగా, ఈసారి 77.1 ఎంఎం వర్షపాతమే నమోదైంది. కదిలే మేఘాలు ఈశాన్య రాష్ర్టాలు, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు, దక్షిణ-మధ్య అరేబియా సముద్రానికే పరిమితమయ్యాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వర్షపాతం పటం రుతుపవనాల అస్థిర ప్రభావాన్ని తెలియజేస్తున్నది. గుజరాత్ 86 శాతం వర్షపాతలోటుతో ఉండగా, మహారాష్ట్రలో 60 శాతం లోటు నమోదైంది. మధ్యప్రదేశ్ లో 42 శాతం, యూపీలో 59 శాతం, బీహార్‌లో 52 శాతం, ఒడిశాలో 53 శాతం, తెలంగాణలో 32 శాతం, కర్ణాటకలో 47 శాతం వర్షపాత లోటు రికార్డయ్యింది.