హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఇన్నోవేషన్ ఇన్ యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్, అండ్ ఎంటర్టైన్మెంట్ (ఇమేజ్)కు సంబంధించిన అన్ని విభాగాల్లో తెలంగాణ జోరుగా దూసుకుపోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మున్ముందు ఈ రంగంలో గొప్ప అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. హెచ్ఐసీసీ వేదికగా ఈ నెల 19 వరకు నిర్వహిస్తున్న ‘ఇండియా జాయ్’ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆర్థికంగా కుంగదీసిన కరోనా సంక్షోభం అనేక అవకాశాలను కూడా తీసుకొచ్చిందని, ముఖ్యంగా డిజిటైజేషన్లో ఎక్కువగా అవకాశాలు పుట్టుకొచ్చాయని తెలిపారు. 2025 నాటికి మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లకు చేరుతుందని ఓ అధ్యయనం స్పష్టం చేసిందని, గతేడాదితో పోల్చితే ఇది 45% అధికమని చెప్పారు. 2024 నాటికి ‘ఇమేజ్’ సెక్టార్ మార్కెట్ విలువ 13.5% వార్షిక వృద్ధిరేటుతో రూ.3 లక్షల కోట్లకు పెరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని రంగాల్లో మాత్రమే ఇం త గొప్ప అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
4 రోజులపాటు ‘ఇండియా జాయ్’
ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్‌గా పేరొందిన ‘ఇండియా జాయ్’ కార్యక్రమంలో భాగంగా గేమ్, దేశీ టూన్స్, వీఎఫ్ఎక్స్, ఇన్ఫ్లుయెన్సర్ కనెక్ట్, ఓటీటీ పల్స్‌పై సదస్సులు నిర్వహించనున్నారు. 30 వేల మందికిపైగా ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, 300 మందికిపైగా ఇంటర్నేషనల్ డెలిగేట్స్, 100 మందికిపైగా పెట్టుబడిదారులు, పబ్లిషర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
గేమింగ్ రంగంలోనూ గణనీయ వృద్ధి
గేమింగ్ రంగంలోనూ తెలంగాణ గణనీయ వృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 80 గేమింగ్ కంపెనీలు ఉన్నాయని, గత రెండేళ్లలోనే 45 కంపెనీలు వచ్చాయని చెప్పారు. హైపర్ క్యాజువల్ గేమ్స్ అభివృద్ధి కోసం హైదరాబాద్‌లోని స్ట్రీట్ ల్యాబ్స్ సంస్థతో ఇజ్రాయెల్ కంపెనీ క్రేజీ ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకొన్నదని తెలిపారు. ఓటీటీకి తాను కూడా అభిమానినేనని, వీక్షకులకు వినోదం ఇవ్వడంలో ఓటీటీ విజయవంతమైందని పేర్కొన్నారు. ఓటీటీ గేమింగ్కూ ఆదరణ పెరుగుతున్నదని చెప్పారు.
తెలంగాణ టూ హాలీవుడ్
హైదరాబాద్ యానిమేషన్ కంపెనీ గ్రీన్ గోల్డ్ రూపొందించిన ‘చోటా భీం’ అనేక రికార్డులను కొల్లగొట్టిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేస్తూ.. దేశీయ చిత్ర పరిశ్రమతోపాటు హాలీవుడ్‌కు వీఎఫ్ఎక్స్ ఔట్సోర్సింగ్ సేవలు అందించడంలో తెలంగాణ ముఖ్యపాత్ర పోషిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో 20 అకాడమీలు, 40కిపైగా ప్రొడక్షన్ హౌస్‌లు ఉన్నాయని, వీఎఫ్ఎక్స్ స్టార్టప్ కంపెనీలకు తోడ్పాటునందించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కూడా ఉన్నదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌కు విస్తరిస్తున్నాయని, దీంతో ఎంతోమందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. నెట్వర్క్ సపోర్టుతోపాటు మెంటార్షిప్ అవకాశం కల్పించడంలో తెలంగాణ వీఎఫ్ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ తోడ్పాటునందిస్తున్నదని పేర్కొన్నారు. ఎంఎన్సీ కంపెనీలను ఆకర్షించి, ప్రొడక్షన్ హౌస్‌లను ఏర్పాటు చేయడంలో ఇక్కడి ఎకోసిస్టం ఎంతో ఉపయోగపడుతున్నదని వివరించారు.
తాన్లా షేర్లు కొన్న ప్రేమ్‌జీ ఫండ్
లావాదేవీ విలువ రూ. 162 కోట్లు
హైదరాబాద్, నవంబర్ 16: హైదరాబాదీ ఐటీ కంపెనీ తాన్లా సొల్యూషన్స్‌లో కొద్దిపాటి వాటాను విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ పయనీర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కొనుగోలుచేసింది. మంగళవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో 13,50,000 షేర్లను రూ.1,200 ధరతో బ్లాక్డీల్గా కొన్నది. ఈ లావాదేవీ విలువ రూ. 162 కోట్లు. కంపెనీ మొత్తం ఈక్విటీలో ఇది దాదాపు 1 శాతం వాటా. ఈ షేర్లను విదేశీ ఫండ్ బ్లాక్‌స్టోన్ క్రెడిట్‌కు చెందిన బన్యాన్ ఇన్వెస్ట్మెంట్ విక్రయించింది. బన్యాన్ ఇన్వెస్ట్మెంట్ 20,58,943 షేర్లను (1.52 శాతం వాటా) రూ.247 కోట్లకు విక్రయించి, తాన్లా నుంచి పూర్తిగా వైదొలిగింది. 2018లో తాన్లా… బ్లాక్‌స్టోన్‌కు చెందిన కంపెనీ నుంచి కారిక్స్ మొబైల్‌ను టేకోవర్ చేసిన సందర్భంగా బన్యాన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు తాన్లా షేర్ల కేటాయింపు జరిగింది. ఈ షేర్లను బన్యాన్ కొద్దినెలలుగా క్రమేపీ విక్రయిస్తున్నది.
‘కేటీఆర్ మంచి నటుడు’: సుధీర్‌బాబు , ‘ప్రశంసను స్వీకరిస్తున్నా’: కేటీఆర్
ఇండియా జాయ్ కార్యక్రమంలో కేటీఆర్, సినీ నటుడు సుధీర్‌బాబులు వారి సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించారు. ‘మంచి నటుడు అన్నీ మరిచిపోయి పాత్రలో ఎలా నటిస్తారో, మంచి రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు మంచి చేయాలంటే తన గురించి, తన కుటుంబం గురించి మరిచిపోయి పనిచేయాలి. అలాంటి వ్యక్తే కేటీఆర్. నేను రాజకీయ నాయకుడిలా నటించాల్సివస్తే కేటీఆర్‌ను అనుకరిస్తా’ అని సుధీర్‌బాబు అన్నారు. అందుకు కేటీఆర్ స్పందిస్తూ ‘ఏంటి సుధీర్…నేను నటుడిలా కన్పిస్తున్నానా.. ఇది నేను మనసులో పెట్టుకుంటా.. ఒకే సుధీర్, ఏది ఏమైనా ఈ విషయాన్ని నేను పాజిటివ్ వేలో చూస్తున్నా. ధన్యవాదాలు.. నీ ప్రశంసను స్వీకరిస్తున్నా’ అని అనగానే కార్యక్రమంలో నవ్వులు పూశాయి.