హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ మెకానికల్ చదువుతున్న విద్యార్థులకు ‘సొసైటీ ఫర్ అటోమోటివ్ ఇంజినీర్స్- ఇండియా కాంపిటీషన్లో జాతీయస్థాయిలో మొదటి బహుమతి దక్కింది. ఓయూలో బీటెక్ మెకానికల్ విభాగంలో సెకండియర్, థర్డ్ ఇయర్‌కు చెందిన 13 మంది విద్యార్థుల బృందం మూడేండ్ల నుంచి శ్రమించి.. ‘ఎలక్ట్రికల్లీ-అసిస్టెడ్ త్రీ వీలర్స్’ అనే కొత్త వాహనాన్ని రూపొందించి జాతీయస్థాయిలో విజయం సాధించారు. దీనిని ఇద్దరు కూర్చునేలా తయారుచేశారు.
ఈ వాహనం పైడిల్తో తొక్కడంతోపాటు ఎలక్ట్రిక్ బ్యాటరీ ద్వారా కూడా నడుస్తుంది. గేర్లతో, గేర్లు లేకుండా కూడా నడుపుకొనే వెసులుబాటును కల్పించినట్టు బృందం సభ్యులు తెలిపారు. 13 మంది మెకానికల్ విద్యార్థుల బృందానికి కెప్టెన్‌గా అభినవ్ కార్తీకేయ, వైస్‌కెప్టెన్‌గా అంకిత కెడమ్ వ్యవహరించారు. మధుసూదన్‌రాజు మెంటర్ ఆధ్వర్యంలో వీరిరువురూ పనిచేశారు. విద్యార్థులను ఓయూ వీసీ అభినందించారు.