కరోనా కొత్త రకంతో మార్కెట్ భారీగా పతనమై గత వారం నిఫ్టీ వంద రోజుల చలన సగటు దిగువకు పడిపోయింది. దీంతో మార్కెట్ డౌన్ ట్రెండ్‌లోకి ప్రవేశించింది. నెల, వారాంతపు చార్ట్‌లలో బేరిష్ ప్యాట్రన్లు ఏర్పడ్డాయి. ఇండికేటర్లు అన్ని టైమ్‌ఫ్రేమ్‌లలో బేరిష్ జోన్లోకి ప్రవేశించాయి. ఈ వారం షార్ట్ కవరింగ్‌తో మార్కెట్లో బౌన్స్ వచ్చినా నిలిచే అవకాశాలు తక్కువ. 18,200 స్థాయిని దాటనంత కాలం మార్కెట్ డౌన్ ట్రెండే. ఈ నేపథ్యంలో ఇక నుంచి కొత్త కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు చేయకపోవడంతోపాటు, పోర్టుఫోలియోలో లాభాలను స్వీకరించడానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. 61.8 శాతం రీట్రేస్మెంట్ స్థాయి, హెడ్ అండ్ షోల్డర్ ప్యాట్రన్ బేరిష్ లక్ష్యాలు కూడా 16,700 స్థాయిలో ఉన్నాయి. ఈ వారం 16,700 నుంచి 17,400 స్థాయిల మధ్య నిఫ్టీ కదలాడే అవకాశం ఉంది.