ముంబై, ఫిబ్రవరి 18 : విద్యా సంస్థలు, ప్రభుత్వ, సెమీ-ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2014లో జారీచేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ శాఖ మంగళవారం ప్రభుత్వ తీర్మానాన్ని జారీచేసింది. కాగా, ఇప్పటికే ఈ ఉత్తర్వు దశాబ్దానికి పైగా చట్టపరంగా ఆమోదం పొందలేదు. ప్రత్యేక వెనుకబడిన తరగతి-ఏ(ఎస్బీసీ-ఏ) కింద ముస్లింలను గుర్తిస్తూ ఆర్డినెన్స్ ద్వారా 2014 జూలైలో ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే ఈ విధానాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేయగా 2014 నవంబర్లో దీని అమలుపై హైకోర్టు స్టే విధించింది.
నిర్ణీత వ్యవధిలోగా ఆర్డినెన్సును రాష్ట్ర శాసనసభలో ఆమోదించని కారణంగా అది చట్ట రూపం దాల్చకపోవడంతో ఆ ఆర్డినెన్సుకు కాలం చెల్లిపోయింది. అనంతరం స్పెషల్ లీవ్ పిటిషన్పై తీర్పు ఇస్తూ ముస్లింలకు రిజర్వేషన్ల కోటాను సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. ఆర్డినెన్సుకు కాలం చెల్లి, సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వు జారీ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వును జారీచేయలేదు. ఎట్టకేలకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వును జారీచేయడంతో ముస్లిం కోటాకు సంబంధించిన అన్ని నిర్ణయాలు రద్దయిపోయినట్లే. ఇకపైన 5 శాతం రిజర్వేషన్ కింద అడ్మిషన్లు, నియామకాలు జరుగవు.