Paris Olympics | పారిస్: విశ్వక్రీడల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్రాన్స్ స్టేడియాల పునరుద్ధరణ, పారిస్ నగర సుందరీకరణ పెట్టిన దృష్టి క్రీడాకారులు ఉండే ‘ఒలింపిక్ విలేజ్’పై మాత్రం పెట్టడం లేదు. ఇక్కడ వసతుల కొరత అథ్లెట్లను తీవ్రంగా వేధిస్తోంది. పారిస్‌లో ప్రస్తుతం ఎండలు మండుతుండగా ఒలింపిక్ గ్రామంలో ఏసీలు లేక ఉక్కపోతతో అథ్లెట్లు అల్లాడుతున్నారు. తాజాగా ఇటలీకి చెందిన స్విమ్మర్ థామస్ సెకాన్ ఒలింపిక్ విలేజ్‌లో ఉండలేక అక్కడికి సమీపంలో ఉన్న పార్క్‌కు వెళ్లి నేలమీదే టవల్ వేసుకుని పడుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజా ఎడిషన్‌లో థామస్ వంద మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో స్వర్ణం గెలవగా పురుషుల 4X100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో కాంస్యం నెగ్గి రెండు పతకాలు సాధించాడు. ఒలింపిక్ విలేజ్‌లో తనకు అసౌకర్యంగా ఉందని థామస్ పలుమార్లు నిర్వాహకులను కోరినా వాళ్లు మాత్రం పట్టించుకోలేదు.
పగలు నిద్ర లేకపోవడంతో ఫ్రీస్టయిల్ ఈవెంట్లో తన ప్రదర్శన ఆశించినస్థాయిలో లేదని అతడు వాపోయాడు. ‘ఒలింపిక్ విలేజ్‌లో ఏసీ లేదు. అక్కడ చాలా వేడిగా ఉంది. అథ్లెట్లకు ఇచ్చే ఆహారం కూడా దారుణంగా ఉంది. ఇందుకే చాలామంది అథ్లెట్లు అక్కడ్నుంచి వేరే చోటకు వెళ్లి ఉంటున్నారు. ఇది చూసీ చూడకుండా వదిలేయాల్సిన విషయం కాదు. అందరికీ తెలియాల్సిన వాస్తవం. ఇక్కడ మధ్యాహ్నం కాసేపు కునుకు తీద్దామంటే వేడి, ఉక్కపోతకు తోడు అనవసర శబ్ధాలతో అది సాధ్యపడటం లేదు. అందువల్లే నేను ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ఫైనల్ చేరలేకపోయాను’ అని తెలిపాడు. అమెరికా టెన్నిస్ ప్లేయర్ కోకో గాఫ్‌తో పాటు మరికొంతమంది బహిరంగంగానే ఒలింపిక్ విలేజ్‌లో వసతుల కొరతపై వ్యాఖ్యానించినా నిర్వాహకులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. భారత క్రీడా మంత్రిత్వ శాఖ సైతం మన అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా 40 పోర్టబుల్ ఏసీలను పంపిన విషయం విదితమే. వసతుల లేమి ఆటగాళ్ల ప్రదర్శనను తీవ్రంగా ప్రభావం చూపుతోందనడానికి తాజా ఘటనే నిదర్శనం.