KTR | సైఫాబాద్ పోలీస్స్టేషన్లో తన పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పోలీస్స్టేషన్లో, యూనిఫాంలో ఉన్న అధికారుల సమక్షంలోనే పక్కా ప్రణాళికతో దాడికి ప్రయత్నించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అడ్డుకోకపోతే భవిష్యత్లో రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
‘‘సామూహిక దాడులు ఎప్పుడూ హత్యతోనే ప్రారంభం కావు. కొన్నిసార్లు పూర్తిగా పనిచేస్తున్న పోలీస్స్టేషన్లో, యూనిఫాంలో ఉన్న అధికారుల సమక్షంలో పక్కా ప్రణాళికతో జరిగే దాడితో ప్రారంభమవుతాయి’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర యంత్రాంగం గూండాయిజాన్ని ప్రోత్సహిస్తూ, దానికి సహకరిస్తున్న తీరు తనను ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే వీధుల్లో సామూహిక దాడులు, మూకదాడులు జరిగే పరిస్థితిని చూస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
సైఫాబాద్ పోలీస్స్టేషన్లో తన పీఆర్వో మహేశ్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డికి ఎదురైన ఘటన ఏ తెలంగాణ పౌరుడికైనా జరగవచ్చని పేర్కొన్నారు. అణచివేతకు తలొగ్గని ఏ పౌరుడికైనా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణ పూర్తిస్థాయి గందరగోళం, అరాచక పరిస్థితుల అంచున ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని విమర్శిస్తూ.. ‘‘వెల్డన్ కాంగ్రెస్’’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్విట్టర్(ఎక్స్) వేదికగా ట్యాగ్ చేశారు.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీసుస్టేషన్ లోకి ఏకంగా 15 మంది గుండాలు అక్రమంగా చొరబడి నా పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ గుండాల పనా ?? లేక మఫ్టీలో పోలీసులకే ముసుగులు వేసి కుట్రపన్ని ఈ దాడి చేయించరా ?? వెంటనే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ కక్షతో పెట్టిన పోలీసు కేసు విచారణ కోసం స్టేషన్ కు పిలిపించి ఖాకీల సమక్షంలో ఈ దాడి చేయించడం వెనక ముమ్మాటికి ముఖ్యమంత్రి హస్తం ఉందని కేటీఆర్ అన్నారు. ఉదయం విచారణకు రమ్మని చెప్పి చీకటి పడే వరకూ కాలయాపన చేయడం చూస్తే, ముందే ఈ దాడి చేయాలన్న కుట్ర పన్నినట్టు స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. గౌరవ హైకోర్టు తదుపరి ఆదేశాల వరకూ మహేశ్, మహేందర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో కక్ష సాధింపులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
ఈ సంఘటనకు హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముసుగు ధరించిన గుండాల దాడిలో గాయపడ్డ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డి కి వెంటనే రక్షణ కల్పించి వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. పోలీస్ స్టేషన్ లోపల, బయట ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని వెంటనే భద్రపరచాలన్నారు. ఈ అరాచక పర్వానికి పాల్పడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ గుండాను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలి. లేకపోతే BRS పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.