హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 ( నమస్తే తెలంగాణ ) : తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు నష్టం కలిగించే జీవో 17ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో పదివేల మంది నిరుపేదలను కాంట్రాక్టర్లుగా ప్రోత్పహించి ఉన్నతస్థాయికి తెచ్చారని గుర్తుచేశారు. రేవంత్ సర్కార్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు పైసా పని కూడా కేటాయించలేదని మండిపడ్డారు. దమ్ముంటే చిన్న కాంట్రాక్టర్లకు విడుదల చేసిన నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇవ్వాళ రాష్ట్రంలో కాంట్రాక్టులు కేవలం రేవంత్‌రెడ్డి బామ్మర్ది, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు, బీజేపీ ఎంపీలు సీఎం రమేశ్, విశ్వేశ్వర్రెడ్డిలకే దక్కుతున్నాయని ధ్వజమెత్తారు.
రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ.4 వేల కోట్ల కాంట్రాక్టును తన అనుయాయులకే ఇచ్చుకున్నారని విమర్శించారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,300 కోట్ల కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని, యంగ్ ఇండియా స్కూళ్ల పేరుతో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్ల అప్పు చేశారని, అందులో 4 రూపాయలైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చారా? అని నిలదీశారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతామని అభయమిచ్చారు. జీవో 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల ముందు 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలు, 420 హామీలతో మాయమాటలు చెప్పి గద్దెనెకిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక అన్నివర్గాలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం, బీసీలకు 42 శాతం (మొత్తం 72 శాతం) రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికారని గుర్తుచేశారు.
రూపాయి టెండర్ పిలిస్తే 72 పైసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే రావాలని, కానీ 72 శాతం కాదు కదా 72 పైసలు కూడా ఈ వర్గాలకు ఇవ్వకుండా అడ్డగోలు జీవోలు తెచ్చారని మండిపడ్డారు. చివరికి గురుకుల పాఠశాలల్లో స్థానిక చిన్న కాంట్రాక్టర్లు సరఫరా చేసే కూరగాయలు, చికెన్, పాలు, బ్రెడ్ వంటి వాటిని కూడా దకకుండా చేస్తూ జీవో 17ను తెచ్చారని విమర్శించారు. ఆ టెండర్లను పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిన్న కాంట్రాక్టర్లను రోడ్లపైకి తెచ్చిన జీవో 17 రద్దయ్యే వరకు, బడుగు బలహీన వర్గాలకు కాంట్రాక్టులు దకేవరకు పోరాటం ఆపేది లేదని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల ప్రకారం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం, బీసీలకు 42 శాతం (మొత్తం 72 శాతం) ఇవ్వాలి. రూపాయి టెండర్ పిలిస్తే 72 పైసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే రావాలె కదా! 72 శాతం కాదు కదా 72 పైసలు కూడా ఈ వర్గాలకు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలు జీవోలు తెచ్చింది.
-కేటీఆర్

రేవంత్‌రెడ్డి పేమెంట్ కోటాలో గద్దెనెకారని, ఆయన రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని కేటీఆర్ చురకలంటించారు. ఢిల్లీ కాంగ్రెస్‌కు నెలనెలా కప్పం కట్టకపోతే సీఎం పదవి ఊస్ట్ అవుతుందని ఎద్దేవాచేశారు. ఢిల్లీకి బ్యాగులు మోసుకుంటూ పోయినన్ని రోజులే ఆయన సీఎం పదవి ఉంటుందని దెప్పిపొడిచారు. తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ హై కమాండ్ మౌనంగా ఉండటానికి ఇదే కారణమని విమర్శించారు. వారికి కప్పం కోసం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మనకు రేవంత్ రెడ్డిని అంటగట్టారని మండిపడ్డారు. అవసరమైతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు.
రేవంత్‌ను ఇచ్చిన హామీలపై ఎవరైనా ప్రశ్నలడిగితే బైరాగి, బఫూన్ మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘మీ కండ్లు పీకి గోటీలాడుతా.. పేగులు మెడలో వేసుకుంటా’ అంటూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘కేసీఆర్ పేరు చెప్పుకొని కేటీఆర్ వచ్చారని అంటున్నాడు. ఔను నా తండ్రి పేరు బరాబర్ చెప్పుకొంటా.. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్’ అని గర్వంగా చెప్పుకొన్నారు. ‘రేవంత్‌రెడ్డీ.. నీ మనుమడు నీ పేరు చెప్పుకోవాలంటే ఒక్కటైనా మంచి పని చెయ్యి’ అని హితవుపలికారు. ‘నువ్వుచేసే దిక్కుమాలిన పనులన్నీ బంద్జెయ్ లేకపోతే నీ మనుమడు కూడా నీ పేరు చెప్పుకోడు’ అని చురకలంటించారు.
రెండున్నరేండ్లలో రూ.4లక్షల కోట్ల అప్పు తెచ్చిన రేవంత్‌రెడ్డి, వాటితో ఒక్క పనైనా చేశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘సంపద సృష్టించాలి.. పెంచాలి..పేదలకు పంచాలి అనే దృక్పథంతో కేసీఆర్ ప్రభుత్వంలో అధికారులు, మేము పనిచేసినం. నాడు చిన్న కాంట్రాక్టర్లను ఆదుకొని గౌరవంగా నిలబెట్టినం. కేసీఆర్ అప్పులు చేశారని రేవంత్‌రెడ్డి చేతగాని మాటలు మాట్లాడుతూ కాలం వెల్లదీస్తున్నరు. కేసీఆర్ వెయ్యికి పైగా గురుకులాలు కట్టించి, 6.50 లక్షల మంది విద్యార్థులకు ఒకొకరిపై రూ.1.20 లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు ఖర్చు చేసి కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య, బూట్లు, దుస్తులు, నాణ్యమైన భోజనం అందించిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిండ్రు. జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తెచ్చిండ్రు. 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు.
కేసీఆర్ కిట్, 15 లక్షల మంది ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా కల్యాణలక్ష్మి కింద ఆర్థిక సాయం అందించిండ్రు. రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో వేసిండ్రు. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలు చేసిండ్రు. నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించిండ్రు’ అని గుర్తుచేశారు. ‘ముఖం బాగాలేక అద్దం పగులగొట్టుకున్న చందంగా..రేవంత్‌రెడ్డికి చేతగాక కేసీఆర్ అప్పులు చేశారని అవాకులు చవాకులు పేలుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త పథకాలు తీసుకురావడమేమో గానీ రేవంత్ ప్రభుత్వం ఉన్న పథకాలను కూడా తీసేసిందని విమర్శించారు. ‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్‌రెడ్డి కొత్త రాగం అందుకున్నడు. కానీ మెడలో పుస్తలతాడు ఎత్తుకపోకపోతే చాలని మహిళలు అంటున్నరు’ అని దెప్పిపొడిచారు.
రేవంత్‌రెడ్డి పేమెంట్ కోటాలో గద్దెనెకాడు. ఆయన రెగ్యులర్, రెన్యూవల్ సీఎం. ఢిల్లీ కాంగ్రెస్‌కు నెలనెలా కప్పం కట్టకపోతే ఆయన సీఎం పదవి ఊస్ట్ అవుతది. ఢిల్లీకి బ్యాగులు మోసుకుంటూ పోయినన్ని రోజులే ఆయన పదవి ఉంటది. తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ హై కమాండ్ మౌనంగా ఉండటానికి ఇదే కారణం. వారికి కప్పం కోసం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మనకు రేవంత్‌రెడ్డిని అంటగట్టిండ్రు.
-కేటీఆర్
ప్రభుత్వం మకలు, వడ్ల కొనుగోలు చేయకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ వివరించారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా? ఈ కాంగ్రెస్‌ను ఎప్పుడు బొంద పెడుదామా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేరొన్నారు. కాంట్రాక్టర్ల సమస్యలపై అధికారులు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. అయినా సమస్య పరిష్కారం కాకుంటే ఎంతదాకైనా పోరాడుదామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ శ్యామ్, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
సర్ పేరు చెప్పుకొని బీఆర్ఎస్ ఓట్లను తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, వాటిని తిప్పికొట్టాని బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సర్‌పై పార్టీ కార్యకర్తలు, బీఎల్వోలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ చేసే ఓటర్ల నమోదుకు సంబంధించిన అవకతవకలపై జాగ్రత్త వహించాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
పార్టీ తరఫున ఎంపిక చేసిన బూత్ లెవెల్ అసిస్టెంట్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. పార్టీ తరఫున ఎంపిక చేసిన బీఎల్ఏలు అర్హులవి ఒక్క ఓటు కూడా తొలుగకుండా కాపాడేలా ప్రయత్నం చేయాలని చెప్పారు. బీఆర్ఎస్ వల్లే తొమ్మిదిన్నరేండ్లలో హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందని, అందుకే బీఆర్ఎస్ మద్దతుదారులు, సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను తొలగించే కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.
ముషీరాబాద్ నియోజకవర్గ ప్రాంతానికి ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ వచ్చి యువతను నమ్మించి ఓట్లేయించుకున్నారని, యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్ పేరిట మభ్యపెట్టి నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా ప్రాంతాల్లో ఓడిపోయినా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించిందని.. నగర ప్రజలు బీఆర్ఎస్ వెంటే నిలిచారని గుర్తుచేశారు.