కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇండియన్-2’ షూటింగ్ డిసెంబర్లో పునఃప్రారంభంకానున్నది. 1996లో విడుదలై ఘన విజయాన్ని సాధించిన ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ఎన్నో అంచనాలతో ఈ సినిమా ప్రారంభమైంది. గత ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ లొకేషన్లో ప్రమాదం జరిగి ముగ్గురు యూనిట్ సభ్యులు కన్నుమూశారు. ఈ సంఘటన తర్వాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌తో దర్శకుడు శంకర్‌కు మనస్పర్థలు రావడంతో షూటింగ్ నిలిచిపోయింది. శంకర్‌కు వ్యతిరేకంగా నిర్మాతలు కోర్టుకు వెళ్లడంతో సినిమా ఆగిపోయినట్లుగా వార్తలొచ్చాయి. ఈ విభేదాల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో తిరిగి షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు శంకర్ సిద్ధమయ్యారు. డిసెంబర్ 15 నుంచి చిత్రీకరణను పునఃప్రారంభించబోతున్నట్లు తెలిసింది. కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సమకాలీన రాజకీయాల్లోని అవినీతిని చర్చిస్తూ ఈ సినిమా తెరకెక్కుతోంది.