Rajpal Yadav | బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ తీహార్ జైలు నుంచి తాత్కాలిక బెయిల్ మీద విడుదలైన సంగతి తెలిసిందే. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాజ్‌పాల్ జైలు లోపల సౌకర్యాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ఉన్నట్లుగానే జైళ్లలో కూడా పొగతాగడానికి ప్రత్యేక ప్రాంతాలను (Smoking Zones) ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ఖైదీలు తమ తప్పులను సరిదిద్దుకుని మారడానికి అవకాశం ఇచ్చే సంస్కరణ కేంద్రాలుగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బయట నుంచి చూసే వారికి ఇది ఎవరు కరడుగట్టిన నేరస్థులో, ఎవరు పొరపాటున నేరం చేసి వచ్చారో అర్థం కాదని, అందుకే ఆధునిక కాలానికి అనుగుణంగా జైళ్లలో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
సుమారు రూ.9 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఫిర్యాదుదారుడైన మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.1.5 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసిన తర్వాత, కోర్టు ఆయన శిక్షను మార్చి 18 వరకు నిలిపివేస్తూ విడుదల చేయాలని ఆదేశించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తన స్వగ్రామంలో ఓ వివాహ వేడుకలో పాల్గొనాల్సి ఉన్నందున రెండు రోజుల పాటు మీడియాకు దూరంగా ఉంటానని, ఆ తర్వాత విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. తాను ఇప్పటికీ భారతీయ పౌరుడినేనని, తన గ్రామంలో ఓటరుగా ఉన్నానని స్పష్టం చేస్తూ, ఎవరి సానుభూతి కోసం తాను ప్రాకులాడటం లేదని, కష్టపడి సంపాదించడంపైనే దృష్టి పెడతానని తెలిపారు. ఆయన జైలుకు వెళ్లిన సమయంలో నటులు సోనూ సూద్, గుర్మీత్ చౌదరి, సంగీత దర్శకుడు రావు ఇందర్జిత్ యాదవ్ ఆయన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారని రాజ్ పాల్ యాదవ్ తెలిపాడు.