హైదరాబాద్ సిటీబ్యూరో/మేడ్చల్, మే 24 (నమస్తే తెలంగాణ): దేశ భద్రతకు విఘాతం కలిగిస్తున్న పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సానుభూతిపరుడు జాయిద్ఖాన్ అలియాస్ ఆదిల్‌ఖాన్ (22) హైదరాబాద్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఐఎస్ఐకి మద్దతు తెలుపుతున్న ముఠాలతో సంబంధాలు కొనసాగిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వ్యక్తిగత సహాయకుడితోపాటు ఆ రాష్ర్టాంలోని ప్రముఖ నాయకుల సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఈ యువకుడిని మేడ్చల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
అతని నుంచి రెండు నకిలీ తుపాకులు, మొబైల్‌ఫోన్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. యూపీకి చెందిన జాయిద్ఖాన్ 4వ తరగతి వరకు చదివాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చి ముబారక్ రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోయింగ్ కోసం బొమ్మ పిస్తోళ్లతో రీల్స్ చేస్తూ పోస్టులు పెడుతుండేవాడు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా పాకిస్థాన్‌లోని ఐఎస్ఐ సానుభూతిపరులతో పరిచయాలు ఏర్పడ్డాయి.
వారిలో అబిద్ జట్, రానా హుస్సేన్ అనే వ్యక్తులతో జాయిద్ఖాన్ తరచూ చాటింగ్ చేసేవాడని, వీరంతా షెహజాద్ భట్టి అనే పాకిస్థానీ గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని తెలుస్తున్నది. ఇస్లాం కోసం పోరాడేందుకు ఆయుధాలు కావాలని జాయిద్ఖాన్ ఐఎస్ఐని కోరడంతో.. పాకిస్థాన్ డాన్ అబిద్ జట్ పేరిట పోస్టర్లను ముద్రించి యూపీలో అంటించడంతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహాయకులు, ఆ రాష్ర్టానికి చెందిన ఇతర ప్రముఖుల ఫోన్ నంబర్లు ఇస్తే అసలైన తుపాకీ పంపిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో జాయిద్ఖాన్ వివిధ మార్గాల ద్వారా పలువురు ప్రముఖుల ఫోన్ నంబర్లతోపాటు యూపీ క్యాబినెట్ వివరాలను సేకరించి పాకిస్థాన్‌కు పంపిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది.