Brwon Bats | ప్రపంచ వ్యాప్తం (World wide)గా ఏటా కొన్ని లక్షల మంది క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. ఇంతమందిని బలిగొంటున్న క్యాన్సర్ వ్యాధిని అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సైంటిస్టులకు ఓ ప్రత్యామ్నాయం లభించింది. అంతరించిపోతున్న గోధుమ రంగు చిన్న గబ్బిలాలు క్యాన్సర్ కారక కణాల నివారణకు తోడ్పడతాయని సైంటిస్టులు ఇటీవల కనుగొన్నారు.
ఈ గబ్బిలాల నుంచి సేకరించిన కణజాల నమూనాలతో వారు ఓ ప్రయోగం చేశారు. ఈ ప్రయోగంలో గబ్బిలాల కణాలను ప్రాణాంతక రసాయనాలతో పరీక్షించినప్పుడు వాటి పరస్పర చర్య DNA రిపేర్‌కు బదులు కణాన్ని నాశనం చేసే జన్యువులకు దారితీసిందని వెల్లడయ్యింది. రసాయనాన్ని ప్రాణాంతక మోతాదులో గబ్బిలాలకు ఇస్తే ఊహించినదానికి పూర్తి భిన్నమైన ఫలితం కనిపించిందని పెన్ స్టేట్ యూనివర్సిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్, బయాలజిస్ట్ జువాన్ మాన్యుయెల్ మన్ని వాజ్క్వెజ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.

Reaserch
ఉత్తర అమెరికాలో అత్యధిక కాలం జీవించే ఈ గబ్బిలం (Bat) నేను దీన్ని కాపాడలేను అని నిర్ణయించుకుని దెబ్బతిన్న కణాలను చంపడానికి తన విధానాన్ని మార్చుకుంటుందని వెర్మాంట్ యూనివర్సిటీలోని ఎవాల్యూషనరీ బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిస్ లాటెర్బర్ వెల్లడించారు. క్యాన్సర్‌ను తట్టుకోగల, ఎక్కువ కాలం జీవించే ఏనుగు జాతి కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తుందని అన్నారు. కాపాడలేకపోతే కణాన్ని చంపేయడమే వీటి లక్షణం అని, గబ్బిలాల దీర్ఘాయువుకు, రోగనిరోధక శక్తికి గల రహస్యం వాటి డీఎన్ఏ విశ్లేషణలో వెల్లడైందని తెలిపారు.
మానవులు, గబ్బిలాల్లో ప్రొటీన్ కినెస్ ఆర్ లేదా పీకేఆర్ (PKR) అని పిలిచే రోగనిరోధక జన్యువు ఉంటుంది. ఇది మానవుల్లో ఒక కాపీ మాత్రమే ఉంటుంది. కానీ ఈ గబ్బిలాల్లో రెండు లేదా మూడు కాపీలు ఉంటాయి అని వాజ్క్వెజ్ వెల్లడించారు.
అంటే సాధారణంగా మానవ కణాలు (Human cells) దెబ్బతిన్న డీఎన్ఏను రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తాయి. విఫలమైతే అవి క్యాన్సర్ కణాలుగా మారుతాయి. కానీ గబ్బిలాల్లో అలా కాదు వాటిని రిపేర్ చేయడం వృథా అని గ్రహించిన వెంటనే ఆ కణాన్ని పూర్తిగా చంపేస్తాయని ఈ పరిశోధలో తేలింది. గబ్బిలాలు కణాలను ఏ విధంగా తొలగిస్తున్నాయో, వాటి జన్యువులు క్యాన్సర్‌ను ఎలా అడ్డుకుంటున్నాయో అర్థం చేసుకోవడం ద్వారా మానవులకు క్యాన్సర్ రాకుండా ఆపే సరికొత్త మందులను, థెరపీలను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని ఈ ప్రయోగం చేపట్టిన సైంటిస్టులు భావిస్తున్నారు.