ప్రభుత్వం ఓడిందా? రైస్ మిల్లర్లు గెలిచారా?
రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ వ్యవహారం రాజకీయ చర్చకు తెరలేపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అక్రమాలు భారీగా వెలుగుచూశాయి.
- పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆకస్మిక బదిలీ
- 13 నెలలకే స్థానచలనం
- ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
- అక్రమార్కులను కాపాడేందుకే సర్కార్ చర్యలా?
నిజామాబాద్, నవంబర్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ వ్యవహారం రాజకీయ చర్చకు తెరలేపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అక్రమాలు భారీగా వెలుగుచూశాయి. సీఎంఆర్ పేరిట ధాన్యం దక్కించుకున్న అనేకమంది రైస్ మిల్లర్లు తిరిగి మర ఆడించిన బియ్యాన్ని సర్కార్‌కు ముట్టజెప్పకుండా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా 2025 సెప్టెంబర్ 30న బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర తనదైన శైలిలో కొరడా ఝులిపించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులతో అక్రమార్కుల భరతం పట్టారు. సీఐడీ బృందాలతో విచారణ చేయించి తప్పు తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.
రూ.వందల కోట్ల అవినీతిని వెలికితీస్తున్న క్రమంలో రేవంత్‌రెడ్డి సర్కార్ పరువు బజారున పడుతుండటంతో చేసేది లేక పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను ఉన్నట్టుండి బదిలీ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 13 నెలలపాటుగా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర ఓరకంగా రైస్ మిల్లర్లను అల్లాడించారు. ఇందులో ప్రధాన ముద్దాయిలుగా తేలినవారిలో కాంగ్రెస్, బీజేపీకి కొమ్ముకాస్తున్న వ్యాపారులే ముందు వరుసలో ఉన్నారు. రైస్‌మిల్లు సంఘాన్ని అడ్డంపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్న ఆ రెండు జాతీయ పార్టీలకు చెందిన నేతలంతా రేవంత్ సర్కార్‌పై ఒత్తిడి తెచ్చి ఉన్నతాధికారి బదిలీ కోసం పట్టుబట్టారనే ప్రచారం జరుగుతున్నది. వందల కోట్ల అవినీతిని వెలికితీస్తున్న అధికారిని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే దాదాపు ఏడాది కాలానికే ప్రాధాన్యత లేని విభాగానికి బదిలీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతున్నది.
ఊపిరి పీల్చుకుంటున్న రైస్‌మిల్లర్లు
సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అక్రమాలు, ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టించడం, నాణ్యమైన సన్న బియ్యం స్థానంలో దొడ్డు బియ్యం సరఫరా వంటి వ్యవహారాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బదిలీ అనేక ప్రశ్నలకు తావిస్తున్నది. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై సీఐడీ దర్యాప్తు, అరెస్టులు, తనిఖీలు కొనసాగుతున్న సమయంలో ఈ స్థానచలనం ప్రాధాన్యత సంతరించుకున్నది. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్టీఫెన్ రవీంద్ర మిల్లర్ల వ్యవహారంలో కఠిన వైఖరి ప్రదర్శించారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్ బియ్యం విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్న సంకేతాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు, విజిలెన్స్ నిఘా, అధికారులపై చర్యలు, అక్రమార్కులపై పోలీస్ కేసులు వంటి పరిణామాలు రైస్ మిల్లర్లలో కలకలం రేపాయి. కేవలం హెచ్చరిలకే పరిమితం కాకుండా అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా యంత్రాంగాన్ని నడిపించారు. అక్టోబర్ 25న సీఐడీ రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించి 14 మంది రైస్ మిల్లర్లను అరెస్ట్ చేయడం ఈ వ్యవహారంలో తీవ్రతను పెంచింది. సన్న ధాన్యాన్ని పక్కదారి పట్టించి, దొడ్డు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేశారన్న ఆరోపణలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది. సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యాన్ని అందించిన అక్రమాల్లో శాఖకు చెందిన అధికారులనూ వదల్లేదు. నిజామాబాద్ పౌరసరఫరాల శాఖ అధికారిని అరెస్ట్ చేయించారు. పేరుమోసిన మిల్లర్లపై కేసులు పెట్టి ఊచలు లెక్కబెట్టించారు.
అక్రమార్కులపై విచారణ జరిగేనా?
స్టీఫెన్ రవీంద్ర బదిలీతో రైస్ మిల్లింగ్ వర్గాల్లో భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ తనిఖీలు, నోటీసులు, బకాయిల వసూళ్లు, క్రిమినల్ కేసుల భయంతో ఒత్తిడిలో ఉన్న కొందరు మిల్లర్లు ఉన్నతాధికారి బదిలీతో ఊరట పొందుతున్నారన్న చర్చ సాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యహరిస్తున్న మంత్రుల ప్రోద్బలంతో బదిలీ జరిగిందనే చర్చ నడుస్తున్నది.మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్న అధికారిని కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని తప్పించిందా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎంఆర్ అక్రమాల్లో చాలామంది కాంగ్రెస్, బీజేపీకి అనుకూల వ్యక్తులే ఎక్కువగా ఉండటం ఇందుకు బలం చేకూరుస్తున్నది. వీళ్లంతా సిండికేట్‌గా మారి ఉన్నతాధికారిని తప్పించి ఊరట పొందారనే వాదన వినిపిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

