e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News ఆనాటి ఎవుసం ఆచరణీయం.. అన్ని తీర్ల సాగు.. రందిలేని బతుకు

ఆనాటి ఎవుసం ఆచరణీయం.. అన్ని తీర్ల సాగు.. రందిలేని బతుకు

  • ఏ ఇల్లు చూసినా గుమ్ముల నిండా ధాన్యం
  • మోట కొట్టి మరీ నీళ్లు పారించిన రైతులు
  • సంప్రదాయ పద్ధతితో దండిగా పంటలు
  • అంతటా పుష్కలంగా పప్పుధాన్యాలు
  • నాడు వరంగల్‌ మార్కెట్‌లో తీరొక్క రాశులు
  • అప్పుడు తిండిమందమే వరి పండించేటోళ్లు
  • విత్తనాలు ఇచ్చిపుచ్చుకునేటోళ్లు
  • పశువుల పెంటతో సారవంతంగా భూమి
  • తీరొక్క పంటలతో కళకళలాడిన భూములు
  • ఆదర్శవంతం పాత తరం కర్షకులు

యాభై ఏండ్లతో పోల్చితే వ్యవసాయం స్వరూపం పూర్తిగా మారింది. గతంలో తీరొక్క పంటల సాగుతో ప్రతి ఇల్లూ ధాన్యాగారంలా ఉండేది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పాడి, పంటలతో ప్రతి పల్లె కళకళలాడేది. కాలక్రమంలో నీటి వనరులు, యాంత్రీకరణ పెరిగిన ఫలితంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని పంటలు తెరమరుగై వరి ఒక్కటే సాగులోకి వచ్చింది. మూసధోరణిలో ‘సాగు’తున్న రైతాంగాన్ని ఉత్పత్తిదారుడి స్థానం నుంచి వినియోగదారుడిగా మార్చివేస్తున్నది. రైతులంతా వరి, పత్తి మాత్రమే సాగు చేస్తుండడంతో పప్పుధాన్యాల కొరత వేధిస్తున్నది. డిమాండ్‌కు తగ్గట్టుగా పంటల సాగులేక రైతులు నష్టాల పాలవుతున్నారు. వరి ధాన్యం కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్‌లో ఇతర పంటలను సూచిస్తున్నది. ఈ తరుణంలో పాతతరం రైతులను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది. ఆనాటి వ్యవసాయంలో వారి అనుభవాలు తీసుకుని మీ ముందుంచుతున్నది.

హనుమకొండ సబర్బన్‌, డిసెంబర్‌ 6 :దేశంలోనే ప్రసిద్ధిగాంచిన వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌కు ముప్పై, నలభై ఏళ్ల క్రితం వెళ్తే తీరొక్క పంటల ధాన్యం రాశులు కనిపించేవి. ఒకవైపు వడ్లు.. మరోవైపు మక్కజొన్నలు, కందులు, పెసర్లు, బబ్బెర్లు, ఆయిందాలు, పల్లికాయ, ఉలువలు, బుడ్డ శెనిగలు, సజ్జలు, పజ్జొన్నలు ఇలా పంటలన్నీ వరంగల్‌ ప్రాంతంలోనే పండించేవారు. దిగుబడి కూడా అదేస్థాయిలో రావడంతో వ్యాపారులు వీటిని కొనేందుకు పోటీపడేవారు. ఇప్పుడు మార్కెట్‌లో ఎటుచూసినా కాసింత పత్తి, లేకపోతే మిరపకాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొంత పల్లికాయ తప్ప పాత పంటలేవీ మచ్చుకు కనిపించడం లేదు. ఇక వడ్లను ఇన్నాళ్లు సర్కారే కొంటుంది. ఇగ ఇవి మార్కెట్‌కు రానే రావు. ఒకప్పుడు అనేక రకాల పంటలతో కళకళలాడిన వ్యవసాయ మార్కెట్‌ ఇప్పుడు బోసిపోయి దిగులుగా దిక్కులు చూస్తున్నది.

- Advertisement -

ఒకప్పుడు ఏ రైతు ఇంటి వైపు చూసినా ఆనందం తాండవించేది. ఇంటిముందు కొట్టంలో ఆవులు, ఎడ్లు, బర్లు వాటి సంతానం చేసే సందడి అంతాఇంత కాదు. అందంగా అలంకరించిన సవారు కచ్చురం ఓ వైపు, ఎడ్లబండి మరోవైపు పలకరించేవి. సహజ ఎరువు కోసం పద్ధతిలో పేర్చిన పెండ కుప్పలు, ఇంటి వంట మంటలో వాడేందుకు తయారు చేసి గోడకు కొట్టిన పెండ పిడుకలు సాక్షాత్కరించేవి. ఇంటి ముందు వాసారాలో పైన దూలానికి కట్టిన వరి, జొన్న గొలుసులను ఒలుసుకు తినేందుకు కిచకిచ రాగాలతో పోటీపడే పిచ్చుకల కోలాహలం. పక్కపొంటి గోడకు నిలబెట్టిన కట్టె నాగలి, గొర్రు. నాగటి కాని, వాటికి కట్టే దుత్తలు, బాడిజోళ్లు ఆ ఇంటి రైతు దర్పాన్ని గుమ్మంలోనే చాటిచెప్పేవి. ఇంట్లో మూలన పెండతో పూసి మూసేసిన గుమ్ముల్లో ధాన్యం దగదగ లాడేది. ప్రతి ఇంటి ముందు నాటుకోళ్ల సందడి అంతా ఇంత కాదు. ఇంటికి వెళ్లగానే కవ్వంలో తయారుచేసిన చల్ల దాహం తీర్చేది. మొత్తంగా పంటను చూడకున్నా ఇంటిని చూస్తేనే తెలిసేది. సమీకృత వ్యవసాయ పద్ధతులతో ఆ ఇల్లు వర్ధిల్లుతున్నదని.

గతంలో ప్రతి గ్రామంలో రైతులు తమకున్న పంట భూమిని మొత్తాన్ని కేవలం పంటల కోసమే కాకుండా ఇతర అవసరాల కోసం కొంత మిగుల్చుకునే వాళ్లు. కచ్చితంగా ప్రతీ గ్రామంలో పశువుల మేత కోసం ఎకరాల కొద్దీ భూమిని కంచె కోసం ఉంచుకునేవాడు. ప్రతీ రైతు కేవలం పంటల పైనే కాకుండా ఆవులు, బర్లు, వ్యవసాయ పనుల కోసం ఎద్దులు.. ఇంకా గొర్లు, మేకలు ఉండేవి. వీటి మలాన్నే పంటలకు వినియోగించేవారు. ఏటా రైతు తమ పాడి ద్వారా సేకరించిన పెంటను ఎడ్లబండ్ల ద్వారా వేసవి విరామంలో తమ పొలాల్లో పోసుకునేవారు. కనీసం పంటల్లో యూరియా బస్తా కూడా వినియోగించేవారు కాదు. మొత్తానికి మొత్తంగా కేవలం పశువులు, గొర్ల ఎరువులనే పంట పొలాల్లో చల్లేవారు. దీంతో భూమి మొత్తం సారవంతంగా ఉండేది. దీనికి తోడు గొర్ల మందలను యేటా రైతుల పంట పొలాల్లో పూటల చొప్పున మందలు పెట్టించేవారు.

ఆ రోజులే బాగున్నయ్‌..

ఆ రోజుల్ల ఎపుసం బాగుండేది. పుట్టెడు అప్పులు జేసి పంట ఏత్తె పురుగుమందులకు సరిపోతలేవాయె. అప్పట్ల ఏమన్న పైసలైనయ్‌. అన్ని మేమే చేసుకునేటోళ్లం. రెక్కల కష్టంతోనే పంటలు పండించేది. గీ తీరుగ మందులు ఎక్కడియి. అందరూ వడ్లు పండియ్యవట్టె. పండిత్తే కొనేటోళ్లు కూడా లేక పరేషాన్‌ కావట్టె.- గుడికందుల కొమురయ్య, రైతు, ములుకనూరు

అప్పుడంతా రెక్కల కష్టమే..

ఆనాడు రైతులు తీరొక్క పంటలతో సిరులు పండించారు. అప్పుడంతా రెక్కల కష్టమే. ఒక్క రూపాయి కూడా నగదు పెట్టుబడి ఉండేది కాదు. ఎరువుల బస్తాల కోసం పురుగు మందుల దుకాణానికి వెళ్లే అవకాశమే లేదు. భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వెలికి తీసుకునే పరిజ్ఞానం అప్పట్లో లేదు. వర్షాధారం మినహాయిస్తే మిగతా పంటలకు మోటలను వినియోగించేవారు. ప్రతీ రైతు తమకున్న భూమిలో కేవలం తిండి గింజల వరకు మాత్రమే వరి వేసేది. మిగతా పంటలన్నీ వంటిల్లుకు అవసరం అయ్యే రీతిలోనే ఉండేవి. రైతులే కాకుండా తమకు పనికి వచ్చే కూలీలు కూడా సామాన్ల కోసం కిరాణా దుకాణానికి వెళ్లడం అరుదు. రైతులు విత్తనాల కోసం ఏనాడూ దుకాణానికి వెళ్లి కొనుక్కునే పరిస్థితి ఉండేది కాదు. రెండు మూడేళ్లు వరుసగా వర్షాలు పడకపోయినా తోటి రైతుల వద్ద విత్తనాలను పెచ్చుల రూపంలో తీసుకునే వారు.

సజ్జలు ఇర్గ పండించేది..

అప్పట్ల రైతులు చిరుధాన్యాలు బాగా పండించేటోళ్లు. ఎక్కువ సజ్జలు, పజ్జొన్నలు, జొన్నలు, కందులు, పెసర్లు వేసేది. పొద్దుగాలనే బాయికాడికి పోయి పొద్దుగూకే యాళ్లకు ఇండ్లకు వచ్చెది. రాత్రిపూట కూడా వ్యవసాయ పనులు చేసేటోళ్లం. ఎపుసం పనుల్ల ఒకరికి ఒకరం సాయం అయ్యేటోళ్లం. చిరుధాన్యాల పంటలకు రూపాయి ఖర్చు ఉండకపోయేది. ఇప్పుడు వేస్తున్న పంటలకు పెట్టుబడి ఖర్చు మస్తు పెరిగింది. ఎన్కటి పంటలు సూద్దామన్న కనవడ్తలేవ్‌. అందరు వరి పంటనే ఎక్కువగా వేస్తున్నారు.- బొజ్జ కొమురయ్య, మల్లికుదుర్ల

బలమైన పంటలే లేవు..

ఇప్పుటి భూముల్ల బలమైన పంటలు పండుతలేవు. గప్పట్ల పజ్జొన్న, ఉలువలు, మక్కలు పండించేటోళ్లం. ఇప్పుడు పత్తి, వరి అనుకుంట పోతే ఏ పంట చేతికచ్చెటట్టు లేదు. బొచ్చెడు మందులు కొట్టవడితిమి. గా మందులు తినుకుంటనే బతుకుతానం తప్ప.. పండించే పంటల్నే బలం లేకుంటపాయె.- కొర్ర రాములునాయక్‌, మంక్యానాయక్‌తండా, ముస్తఫాపూర్‌

అప్పటి పద్ధతులే వేరు..

మా రోజుల్ల పంటలన్నీ పెంట పోశే పండించేటోళ్లం. ఇప్పటిలెక్క గిన్ని మందులు పోయలే. అప్పటి పద్ధతులే వేరు. రైతులు పండించిన ధాన్యాన్నే మళ్లీ పంటకు వాడుకునెటోళ్లు. ఇప్పుడు ఉన్నట్లు ఇత్తనాలు అప్పట్లో వచ్చేవి కావు. పొద్దుగాలనే పోయి ఎడ్లతో మోటకొట్టి పంటకు నీళ్లు పెట్టేది. కరెంట్‌ మోటార్లు లేనేలేవు. అందరం కలిసిమెలిసి సంతోషంగా పనులు చేసుకునేది. మాకు పనికి వచ్చే కూలీలు కూడా సంతోషంగా ఉండేటోళ్లు. – భట్టు వెంకటయ్య, మల్లికుదుర్ల

అన్నితీర్ల పండించేటోళ్లం

అప్పట్ల వ్యవసాయం చేస్తే ఉప్పుతో తొమ్మిది పండేవి. కోడి కూయంగ బాయి కాడికి పోతే పొద్దుకూకినంకనే ఇంటికి తొవ్వవట్టేది. రోజూ అవసరం ఉండే అన్ని పంటలు కందులు, పెసర్లు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, పల్లికాయ, పొద్దుతిరుగుడు గిట్ల అన్ని పండించేటోళ్లం. ఇప్పుడు పత్తి, మక్కజొన్న, వరి, మిర పంటలు మాత్రమే పండిస్తున్నారు. – పాక రామయ్య, ఐనవోలు

ఆరుతడి పంటలే పండిచ్చేది

ఇరవై ఏళ్ల కింద కాలువ నీళ్లు రాక.. బాయిల నీళ్లు లేక కొద్దిపాటి నీళ్లతో ఆరుతడి పంటలు పండిచ్చేది. భూములు దున్నేందుకు ట్రాక్టర్‌లు లేకపోవడంతో నాగలి కట్టి దుక్కి దున్ని పల్లికాయ, మక్క, కంది, బబ్బెర, పెసరు, శనగ సాగు చేసేది. వరి పంట వేసేందుకు నీళ్లు లేక.. తిండి మందం వేసుకునేది. ఎస్సారెస్పీ కాల్వ నీళ్లు వచ్చినప్పటి నుంచే వరి వేస్తున్నం. కాల్వ నీళ్లు వచ్చుట్ల బావుల్లో నీటిమట్టం పెరిగి వరి సాగు చేస్తున్నం.- మిల్కూరి కుమారస్వామి, రైతు, ఉప్పల్‌

అప్పటి పంటలే బాగుండేది

మక్కజొన్న, వేరుశనగ, పెసర, కంది, శనగ పంటలు పండిచ్చేది. కాల్వ నీళ్లు రాకముందు బావుల్లో ఉన్న నీళ్లతోటి భూములు రికాం ఉండకుండా పెసర, బబ్బెరులు చల్లేది. మక్కజొన్న, వేరుశనగ పంటలు వేస్తే కొద్దిపాటి నీళ్లతో పంటలు పండేది. అప్పుడు తినేందుకు బియ్యం లేకపోయేది. అందుకే తిండి కోసమే వరి వేసుకునేది. కాల్వ నీళ్లు వచ్చినప్పటి నుంచి వరి సాగు పెరిగింది. వరి వేయడం వల్ల ఆరుతడి పంటలు తక్కువైనయ్‌.- దండేబోయిన కొమురయ్య, ఉప్పల్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement