కట్టుబాట్లను వదిలేసినప్పుడు సంతోషంగా ఉన్నా, తర్వాత సమాజం నుంచి వచ్చే విమర్శల వల్ల దుఃఖమూ కలుగుతుంది. మనసు ఒక్కోసారి ఆకాశంలో విహరిస్తున్నట్టుగా, ఒక్కోసారి దుఃఖపడుతూ, ఒక్కోసారి నిస్తేజంగానూ, నిరుత్సాహంగానూ ఉంటుంది. మన మనసు ఎలా ఉంటే, ఆ భావం ముఖంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఒక మనిషి చెడ్డవాడా, మంచివాడా అనే నిర్ణయం మనసును బట్టే ఉంటుంది. అందుకే, ఎందరో వాగ్గేయకారులు, గేయ రచయితలు ఎంతో అనుభవంతో, మనసును సంబోధిస్తూ రచనలు చేశారు.
భారతీయ సంగీతంలో, వివిధ సాహిత్య రీతుల్లో మనసును సంబోధిస్తూ అనేక రచనలు చోటుచేసుకున్నాయి. మనసుకు ఒక రూపం అంటూ లేదు. కానీ, మన ఇంద్రియాలకు మాత్రం అధికారి మనస్సే. మనం ఏ పనిచేసినా, అది మనసుతో ముడిపడి ఉంటుంది. మనిషి పురోగతికి, తిరోగతికీ మనసే కారణం. అందుకే అది స్వేచ్ఛగా తిరగాలని, కట్టుబాట్లను వదిలేయాలని చూస్తుంది.
మనసు, దాని స్వరూప స్వభావాలు, జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాల్లో మనసు తీరుతెన్నులు ఎలా ఉంటాయో అనుభవపూర్వక రచనల సాహిత్యాలను పరిశీలించి తెలుసుకుం దాం. భారతీయ సంగీతంలో మనసును సంబోధిస్తూ వెలువడిన వివిధ రీతులైన శాస్త్రీయ, భక్తి, లలిత, జానపద, చలనచిత్ర సంగీతాలు ఎలా ఉన్నాయో, ఆయా రచనల భావం, ఆ రచనల్లో గల సాహిత్య విలువలను ఒకసారి సింహావలోకనం చేద్దాం.
సామవేద జనితమైన శాస్త్రీయ సంగీతం హిందుస్తా నీ, కర్ణాటక సంగీత బాణీలుగా ఉన్నది. వీటిలో కర్ణాటక సంగీతం, మన దక్షిణ భారతానికి చెందిన ది. ఈ సంగీత రీతిలో మనసు మీద రచనలు ఎక్కువగా తెలుగులో తర్వాత సంస్కృతం, హిందీ, తమి ళం, కన్నడం వంటి ప్రాంతీయ భాషల్లో వచ్చాయి. 18వ శతాబ్దానికి చెందిన వాగ్గేయకారులైన త్యాగ య్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సం గీతానికి త్రిమూర్తులు. వీరికృతులు, కీర్తనలు, రచనలు, నేటి శాస్త్రీయ సంగీతం అనేంతగా సంగీత ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ఈ ముగ్గురిలో త్యాగరాజ స్వామి రచనలు అప్పటి సామాజిక పరిస్థితులకు దగ్గరగా ఉం డటం వల్ల విశేష ఆదరణ పొందాయి. త్యాగరాజు రామభక్తుడు. వూంఛవృత్తి చేస్తూ జీవనం గడిపేవాడు. ఐహిక సుఖములను వదిలి రాముని పరబ్రహ్మగా భావించి నాదోపాసన ద్వారా తరించాడు. ఆయన కృతులలో మనసును సంబోధిస్తూ, మనసుకు వివిధ విషయాల గురించి బోధిస్తూ సాగే రచనలుఎక్కువగా ఉన్నాయి.
‘మనసా ఎటులోర్తునే, నా మనవిని చేకొనవే/ దినకరకుల భూషణుని’ అంటూ మనసును చెడు స్నేహాలు చేయకుండా, తరింపజేసే మార్గం తెలుపమంటూ వేడుకుంటున్నట్టుగా సాగుతుందీ పాట. ‘అలాగే, ఉండేది రాముడొకడు/ ఊరక చెడిపోకే మనసా/ ధర్మాత్ముడు, సర్వసముడు క్షేమకరుడు త్యాగరాజ చిత్తహితుడు/ జగము నిండి’ అనే ఈ కీర్తనలో సగుణ రూపుడైన రాముడికి, నిర్గుణమైన పరబ్రహ్మ తత్వాన్ని ఆపాదించి మనసుకు బోధించడం కనపడుతుంది. ఈ కీర్తన 28వ మేళకర్త హరి కాంభోజి రాగంలో ఉన్నది. ఈ రచనలు శాస్త్రీయ సంగీతంలో మచ్చు తునకలు.
మన భారతీయ జీవనశైలిలో దేవునిపై భక్తి చాలా ఉంటుంది. అయితే, మనిషి ఏ మార్గంలో నడవాలన్నా దానికి మనసు సహకరించాల్సిందే. చిన్నప్పటి నుంచి రామభక్తుడైన త్యాగయ్య… ‘మనసు స్వాధీనమైన/ ఆ ఘనునికి/ మరి మంత్రతంత్రములేల?’ అన్నాడు. అంటే, మనసు సహకారం మనిషికి ఎంత ప్రధానమైనదో దీని ద్వారా తెలుస్తున్నది.
తెలుగునాట భజనల్లో తప్పకుండా వినవచ్చేవి రామదాసు కీర్తనలు. కంచర్ల గోపన్న తన భక్తి రచనల ద్వారా భక్త రామదాసుగా పేరుగాంచారు. అయితే రామదాసు తన మనసుకు, కేవలం రామునిపై భక్తి, వైరాగ్యాలనే కాకుండా, సామాజిక బాధ్యతను కూడా బోధించాడు. ‘శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు ఘోరమైన తపములను / కోరనేటికే మనసా భాగవతుల పాదజలము/ పైన చల్లుకొన్న చాలు భగీరథికి పోయ్యేననే భ్రాంతి ఏటికే ’ అంటూ ఒక చరణంలో, మరో చరణంలో సామాజిక బాధ్యతగా… ‘పరుల హింస చేయకున్న /పరమ ధర్మమంతె చాలు/ పరుల రక్షింతునని/పల్క నేటికే దొరకాని పరుల ధనముల దోచక ఉండితె చాలు గురుతుగాను గోపురము, కట్టనేటికే మనసా’ అంటూ ఘోరమైన తపస్సులు చేయవలసిన అవసరం లేదని, మహాభక్తుల పాద జలము చాలు, గంగానది వద్దకు వెళ్లనవసరం లేదనీ చాలా చక్కగా చెప్పారు. అలాగే పరాయివాళ్ల ధనం మీద ఆశపడి వాటిని దోచి పేరు రావడానికి గుడి గోపురాలు కట్టించినా నిష్పలమని సామాజికపరంగా అందరికీ కనువిప్పు కలిగించే విధంగా కీర్తనలు చేశారు. మనసుకీ, మనిషికీ మార్గనిర్దేశనం చేయగల ఈ కీర్తన, సాహిత్యపరంగా రామదాసుచే కావించబడిన ఒక గొప్ప మానస సంబోధన.
గ్రామ ఫోన్ రికార్డులు, రేడియోల ద్వారా జనంలోకి చేరిన సంగీత రీతి లలిత సంగీతం. శాస్త్రీయ సంగీతానికి భిన్నంగా నూతనంగా ఉండే ఈ లలితగీతాలు సంగీతం, ప్రకృతి, ప్రేమా, భక్తి వైరాగ్యం దాకా స్పృశించని అంశం లేదు. శాస్త్రీయ సంగీతంలోని కృతుల లాగా పాండిత్యమే ప్రధానంగా కాకుండా, సాహిత్య రస భావానుగుణమైన రాగ రచనతో ఆధునిక గేయ రచనలను పాడే సంగీతం తొలి రోజుల్లో గీతావళి అని, ఆ తర్వాత లలిత సంగీతం అనీ వాడుకలోకి వచ్చింది. లలిత సంగీత లక్షణాన్ని బాలాంతరపు రజనీకాంతరావు ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర రెండవ భాగంలో చెప్పారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, బసవరాజు అప్పారావు, నండూరి వెం కట సుబ్బారావు, బాపిరాజు, బాలాంతపు రజనీకాంతరావు వంటి రచయితలు.. విశ్వనాథ, సాలూరి రాజేశ్వరరావు, చిత్తరంజన్ వంటి స్వరకర్తలు.. ఘంటసాల, బాలమురళికృష్ణ, బాల సరస్వతి, అనసూయ, సుశీల, శ్రీరంగం గోపాలరత్నం వంటి గాయక శిఖామణులు లలిత సంగీతానికి పరిపుష్టిని చేకూర్చారు. మల్లవరపు విశ్వేశ్వర రావు రచించిన ఒక మానస బోధగేయం… ‘మరపురాని కలలు కని, మరుదినమ్ము మేలుకొని నిరాశలే/ మిగులునని తెలుసుకొంటివా మనసా/ అలసి యుంటివా మనసా ప్రేమ నిన్న రోజుదని/ నేడు కరిగిపోయెననీ/ వేదనయే రేపటనీ తెల్ల మాయెనా! గుండెలు తల్లడిల్లెనా! మనసా! అలసటా యెనా మనసా!’ అంటూ ప్రేమలో విఫలమైనప్పుడు మనసు పడే బాధను చక్కగా వివరిస్తుంది. ఒకరిపై ప్రేమ కలగాలన్నా లేదా ఏ విధమైన భావన కలగాలన్నా మనసుదే కీలకపాత్ర. కనుక ఈ గీతంలో ప్రేమ విఫలమైనప్పుడు కలిగే బాధను మనసే పడుతున్నట్టు భావించి కవి ఈ గీతాన్ని రాశారు. అలాగే కృష్ణశాస్త్రి కూడా ‘ఒదిగిన మనసున, పొదిగిన భావం’ అన్న లలితగీతానికి ఈమని శంకరశాస్త్రి సంగీతం సమకూర్చారు.
జానపద సంగీతం, సాహిత్యం పల్లె ప్రజల్లో అసువుగా పుట్టాయి. వీటికి సాధారణంగా రచయితలుండరు. ఉన్నా తెలియదు. పల్లెల్లో బుర్రకథలు, హరిదాసులు, యాచకుల వద్ద మనకు వినిపిస్తూ ఉంటాయి. ఇటువంటి వాటిలో ఎక్కువగా మనసుకు సంబంధించిన జ్ఞాన, వైరాగ్యాలను చూపే తత్వసాహిత్యం ఉంటుంది. ‘ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనచు ఏల భ్రమసితివయ్య మనసా! కాలుని వలలోన/కానక చిక్కితివి కడతేరుటే త్రోవమనసా ఒంటరిగ యాగంటి దాసుని మదిలోన జంట బాయక వుండు మనసా’ అంటూ సాగిన జానపద గేయం యాగంటి లక్ష్మప్ప రాసిన గేయంగా, ‘ఆంధ్రుల కీర్తన వాఙ్మయ కళాసేవ’ అని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గ్రంథంలో ఉన్నది. ఇటువంటి జానపద గేయాలు జ్ఞాన భాండాగారాలు. తర్వాతి తరాలవారి కోసం వీటిని భద్రపరచడం మన బాధ్యత.
మనసు గురించి పద్యాలతో ప్రారంభమై, నవరసాలను కురిపిస్తూ, అనేక రీతులను తనలోకి తీసుకుంటూ శాస్త్రీయ, లలిత, జానపద సంగీతాలకు దీటుగా చలనచిత్ర సంగీతం ఆవిర్భవించింది. సినీ గేయ రచయితల లో ఒకరైన ఆత్రేయకు మనసు కవి అని పేరు. మనసునే ప్రధాన కవితా వస్తువుగా తీసుకొని ఆయన ఎన్నో పాట లు రాశారు. వాటిలో మనసు స్వరూపాన్ని, స్వభావాన్నీ చక్కగా చూపిన ఈ పాట ‘గుప్పెడు మనసు’ లోనిది. ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానే కన్నీరు అవుతావు చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా/ ఎందుకు వలచేవో /ఎందుకు వగచేవో’.. ఎందుకు రగిలేవో మనసా’ అని ఈ పాట సాగుతుంది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన ఈ పాట ప్రేక్షకుల మనసును దోచుకున్నది.
నిజానికి, అనుకూల పరిస్థితుల్లో కంటే ప్రతికూల పరిస్థితుల్లోనే మనసు ఉనికిని గుర్తిస్తాం. ఇలా క్షణిక ఆనందాల వైపు తిరిగే మనసును, దాని స్వభావాన్ని ఎత్తి పొడుస్తూ, బతిమాలుతూ, ప్రేమ, ఆనందం, బాధ కలబోస్తూ, మనసు మీద రాసిన కవిత్వం, సాహితీ ప్రపంచంలో ఒక విశిష్ట స్థానం సంపాదించుకున్నది. శాస్త్రీయ సంగీతంలోని కృతుల లాగా పాండిత్యమే ప్రధానంగా కాకుండా, సాహిత్య రస భావానుగుణమైన రాగ రచనతో ఆధునిక గేయ రచనలను పాడే సంగీతం తొలి రోజుల్లో గీతావళి అని, ఆ తర్వాత లలిత సంగీతం అనీ వాడుకలోకి వచ్చింది.