సంగీత మాంత్రికుడు ఇళయరాజాకు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఐదు దశాబ్దాల సంగీత ప్రస్థానానికి గుర్తింపుగా ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఆయన పేరుతో ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు. విక్టోరియన్ ప్రభుత్వ ప్రతినిధులు, పార్లమెంట్ సభ్యుల సమక్షంలో ఈ స్టాంప్‌ను రిలీజ్ చేశారు. ఇళయారాజా మాట్లాడుతూ.. తమిళనాడులోని ఓ చిన్న గ్రామం నుంచి సంగీత ప్రయాణాన్ని ప్రారంభించి, నేడు అంతర్జాతీయ స్థాయిలో ఘనతను సాధించడం భావోద్వేగాన్ని కలిగిస్తున్నదని అన్నారు.
ఈ సందర్భంగా విక్టోరియన్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి ఎంపీ ఎన్వర్ ఎర్డొగాన్, పార్లమెంట్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన సంగీత ప్రయాణంలో భాగమైన కళాకారులు, సంగీతకారులకు, తన పాటలను ఆదరిస్తున్న శ్రోతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 50ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఇళయరాజా ప్రపంచవ్యాప్తంగా సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 26న సిడ్నీలో, అక్టోబర్ 5న బ్రిస్బేన్‌లో ఆయన సంగీత విభావరిలు జరుగనున్నాయి.