ICC : మహిళా క్రికెటర్లకు మరింత భరోసా కల్పించే దిశగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మరో ముందడుగు వేసింది. మాతృత్వ దశలో మహిళా క్రికెటర్లకు ఆర్ధికంగా, వైద్య పరంగా సాయం అందించేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. బిడ్డను కన్న తర్వాత అమ్మగా.. మళ్లీ క్రికెట్ ఆడే వారికోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది అత్యున్నత క్రికెట్ మండలి. మహిళా ప్లేయర్లు పిల్లలకు జన్మనివ్వడం నుంచి.. మళ్లీ మైదానంలోకి దిగేంత వరకూ వారికి పెద్దన్నలా అన్ని విధాలా సాయం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఐసీసీ వెల్లడించింది.
ఐసీస ఈవెంట్లో పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు చెల్లిస్తున్న ఐసీసీ.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. తల్లైన తర్వాత మళ్లీ క్రికెట్ ఆడాలనుకునే మహిళా ప్లేయర్లకు అడుగడుగునా భరోసాగా నిలువనుంది. గర్భం దాల్చిన అనంతరం, ఆపై ప్రసవం అనంతరం శారీరక, మానసిక మార్పులకు లోనయ్యే మహిళా క్రికెటర్లకు అనుకూలమైన వాతావరణంలో శిక్షణ ఇవ్వాలని ఐసీసీ భావిస్తోంది.
🚨 ICC launches ‘Return to Play Post-Pregnancy Guidelines’ for female cricketers
The guidelines outline a framework for boards to support players through pregnancy, childbirth and their return to elite cricket#CricketTwitter pic.twitter.com/D9nRL59AVj
— Cricbuzz (@cricbuzz) June 22, 2026
అలానే.. వారి పిల్లలను చూసుకోవడం, గర్భిణిలకు రవాణా, మెడిసిన్ ఖర్చులు భరించడం వంటివి చూసుకోనుంది. చాలామంది క్రికెటర్లు కెరీర్ సమయంలోనే వైవాహిక జీవితం వైపు మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయాలను అనుసరించాలనుకుంటోంది. ఆస్ట్రేలియా మహిళల జట్టు డాక్టర్ ఫిలిప్పా ఇంగే(Philippa Inge) నేతృత్వంలోని ఐసీసీ వైద్య సలహా కమిటీ సూచనల మేరకు ఈ కార్యాచరణను రూపొందించారు.
కాన్పు అనంతరం క్రికెట్ ఆడేందుకు సిద్ధపడే వారికోసం ఆరు దశల ప్రణాళిక ఉంది. రెడీ, రివ్యూ, రిస్టోర్, రీ-కండీషన్, రిటర్న్, రిఫైన్.. ఈ ఆరు విధానాలను అనుసరించి అమ్మలైన క్రికెటర్లను తిరిగి ఆటవైపు మళ్లించాలని ఐసీసీ భావిస్తోంది. అందుకోసం డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్‌ను నియమించనున్నారు. మూడో ట్రెమిస్టర్.. కాన్పు తర్వాత ఆరు లేదా ఎనిమిది వారాలకు క్రికెట్ సన్నాహకాలు ప్రారంభించడం వంటివి ఫిజియోథెరపిస్ట్ చూసుకుంటారు. 2021లో బిడ్డను కన్న వెస్టిండీస్ స్పిన్నర్ అఫీ ఫ్లెచర్ ఇప్పుడు క్రికెట్ ఆడుతోంది. ఫ్లెచర్ మాదిరిగానే మరికొందరు మాతృత్వం అనంతరం ఏ ఇబ్బందులు లేకుండా మైదానంలో మెరిసేలా ఐసీసీ చొరవ చూపిస్తోంది.