తెలంగాణ నేపథ్యంతో.. తెలంగాణ ఆచారాలు, యాస, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఇలా అన్ని కలగలిపి తెలుగు సినిమా చరిత్రలోనే ఓ క్లాసిక్‌గా మిగిలిపోయిన బలగం చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు ఎల్ధండి వేణు. బలగం సినిమా చూడని తెలంగాణ వాడు, తెలుగువాడు లేడంటే అతిశయోక్తి కాదేమో.. అయితే వేణు సినీ పరిశ్రమలోకి ప్రవేశించడానికి చాలా కష్టపడ్డాడు.. ఇటీవల ఓ సందర్భంలో ఆయన తన సినీ రంగ ప్రవేశం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
సినీ పరిశ్రమ మీద మక్కువతో ఇంట్లో చెప్పకుండా పారిపోయి హైదరాబాద్‌కు వచ్చాను. జేబులో రెండు వందల డెబ్బయ్ ఐదు రూపాయాలు బ్యాగులో రెండు జతల బట్టలు. ఇవే అప్పుడు నా ఆస్తిపాస్తులు. హైదరాబాద్ వచ్చిన తరువాత ఎక్కడ వుండాలో తెలియక మూడు రోజులు బస్టాండులోనే వున్నాను. ఛాయ్, డబుల్ రొట్టే మాత్రమే తినేవాడ్ని. ఇక అన్నపూర్ణ స్టూడియో అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్లిపోయాను. అక్కడ ఆ గేటు ముందు అందరి వారు నాలాగా అవకాశాల కోసం ఎదరుచూస్తున్నవాళ్లే. అక్కడ ఆ స్టూడియో ముందు రోడ్డు మీద వున్న పైపుల్లో నిద్రపోయేవాడ్ని. మంగళవారం, శుక్రవారం పెద్దమ్మ గుడిలో అన్నదానాలతో ఆకలి తీర్చుకునేవాడిని. మిగతా రోజులు దాదాపు పస్తులే. వున్న రెండు జతల బట్టల్లో ఒకటి ఒంటి మీద, ఇంకోటి ఊతికి ఆరేసి వుండేది. ఇక టవలు, చెప్పులు మాత్రం దగ్గర్లో వుండే ఇసుకను తవ్వి అందులో పెట్టి పూడ్చేవాళ్లం. లేదంటే పడుకున్నప్పుడు దొంగలు ఎత్తుకెళ్లాతరనే భయం వుండేది.
అనుకోకుండా సెట్బాయ్గా అవకాశం వచ్చింది. ఆ తరువాత ఓ డైరెక్టర్ దగ్గర పనిచేశాను. అప్పుడే చిత్రం శ్రీను పరిచయమయ్యాడు. కొంతకాలం ఆయన దగ్గర టచప్ బాయ్‌గా చేశాను. తరువాత జై సినిమాలో నటుడిగా అవకాశాలు వచ్చే దాకా ఎన్ని కష్టాలు చూడాలో అన్ని చూసేశాను. దర్శకుడు తేజ అడిషన్ కోసం ఫోటోలు పంపడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. నా మిత్రుడు కొత్తపల్లి శేషు సహాయంతో ఫోటోలు పంపాను. ఆ తరువాత అడిషన్లో సెలక్ట్ కాగానే నాలుగు జతల బట్టలు కూడా కుట్టించి షూటింగ్‌కు పంపాడు. ఆ స్నేహితుడి చేసిన సహాయం జీవితాంతం మరిచిపోలేని’ అంటూ గుర్తుచేసుకున్నారు బలగం వేణు.